జీఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శిపై ఫిర్యాదు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
జీఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి ఆర్‌. అజగేసన్‌పై ఆ సంస్థ ఉద్యోగులు కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగులతో ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారనీ, ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు. డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా రవాణా సదుపాయాన్ని వినియోగించుకుంటు న్నారని చెప్పారు. సొంత అవసరాలకు కార్యాలయ వాహనాన్ని వినియోగించు కోవడం సరికాదని చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా రూ. 13 వేలను ఆటో చార్జీల కింద కార్యాలయం నుంచి తీసుకున్నారని వివరించారు. వైద్య ఖర్చుల కోసం కూడా మార్గదర్శకాలకు వ్యతిరేకంగా బిల్లులు తీసుకున్నారని చెప్పారు. కండ్లద్దాల కోసం రూ.21 వేలు తీసుకున్నారని చెప్పారు. జీఆర్‌ఎంబీ గణాంక విభాగం సీజీహెచ్‌ఎస్‌కు సిఫారసు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. శిక్షణ ఇచ్చే పేరిట రూ. 10 వేలు తీసుకున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా జీఆర్‌ఎంబీకి వస్తువుల కొనుగోళ్లు చేస్తున్నారని సీడబ్ల్యూసీకి చేసిన ఫిర్యాదులో ఉద్యోగులు పేర్కొన్నారు. గతంలో మహిళా ఉద్యోగులను వేధించారనే ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యపై కూడా గతంలో ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలను సైతం ఆరా తీసే దురలవాటు ఉందని వివరించారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ చైర్మెన్‌, జీఆర్‌ఎంబీ చైర్మెన్‌కు ఫిర్యాదు చేశారు.