నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం దేగాం గ్రామంలో గురడిరెడ్డి సంఘం వెనుక గ్రామపంచాయతీకి చెందిన స్థలాన్ని దొడ్ల సత్యం అనే వ్యక్తి ఆక్రమించి నిర్మాణం చేశాడని గురడి రెడ్డి సంఘం సభ్యులు జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ)కి ఫిర్యాదు చేశారు. దేగాం గురడిరెడ్డి సంఘం సభ్యులు గురువారం జిల్లా కేంద్రంలోని డిపిఓ కార్యాలయానికి తరలి వెళ్లారు. సంఘం వెనుకనున్న జిపి స్థలాన్ని ఆక్రమించుకొని సత్యం 2021 జనవరిలో అక్రమ నిర్మాణం చేశాడన్నారు. ఈ స్థలం గుండా కాలనీవాసులు వెళ్లే దారి కాబట్టి సంఘ సభ్యులు, కాలనీవాసులు అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ ఫిర్యాదు మేరకు ఎంపిఓ, డి ఎల్ పి ఓలు సందర్శించి జిపి స్థలాన్ని ఆక్రమించినందున 2021 జనవరి 9వ తేదీన తొలగించాలని గ్రామ కార్యదర్శికి ఆదేశించారన్నారు. అధికారుల ఆదేశాల మేరకు గతంలో అక్రమ కట్టడాన్ని తొలగించారన్నారు. తిరిగి సత్యం జిపికి చెందిన స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణం చేశాడని చెప్పారు. ఈ అక్రమ నిర్మాణం వలన కాలనీవాసులకు, తమకు ఇబ్బందులు కలుగుతున్నందున పరిశీలించి అక్రమ కట్టడానికి తొలగించాలని వారు డిపిఓకు కోరారు.