నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐకి ఫిర్యాదు..

Complaint to SI to take action against fake journalistsనవతెలంగాణ – జన్నారం
నకిలీ విలేకరులుగా చలామణి అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జన్నారం మండల ప్రెస్ క్లబ్  ఆధ్వర్యంలో  సోమవారం  జన్నారం ఎస్.ఐ రాజవర్ధన్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు  చిలువేరు నర్సయ్య మాట్లాడుతూ విలేకరులమంటూ కొంతమంది జన్నారం మండలంలో అధికారులకు,రాజకీయ నేతలకు,వ్యాపారస్తులకు,పాఠశాల యజమానులకు ఫోన్లు చేసి ప్రముఖంగా ఉన్న వివిధ దినపత్రికల పేర్లతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని అన్నారు. రాత్రి వేళల్లో, తెల్లవారుజామున విలేకరులమని చెప్పుకొని మరి కొంతమంది అక్రమ వసూలు చేస్తున్నారు. ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడే నకిలీ విలేకర్ల వల్ల నిజమైన పత్రికలలో పనిచేస్తున్న విలేకరులపై ప్రజల్లో చులకన భావం కలిగి విలేకరుల ప్రతిష్టకు భంగం కలుగుతుందని అన్నారు. ఈనెల 11 న ఆదివారం మండల కేంద్రంలోని జయరాణి ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ మధుసూదన్ కు ఫోన్ చేసి నేను మంచిర్యాల జిల్లా ప్రజాతంత్ర స్టాప్ రిపోర్టర్ అని, తిరుపతి అనే వ్యక్తి పత్రిక వార్షికోత్సవం ఉందని రూపాయలు ఐదువేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయిందని అన్నారు. అదేవిధంగా కార్లు, టాటా ఏస్, జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై విలేకరులు కాకున్నగానీ ప్రెస్ స్టిక్కర్లు పెట్టుకొని వాహనాలపై దర్జాగా తిరుగుతున్నారు. పోలీసులు  స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నకిలీ విలేకరులపై, ప్రెస్ స్టిక్కర్లు పెట్టుకొని వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిజమైన విలేకరులకు (అక్రిడేషన్) ప్రెస్ స్టిక్కర్లు జారీ చేయాలని కోరారు. జర్నలిస్టుల పేరును వాడుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సై గుండేటి రాజ వర్ధన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గాజుల లింగన్న గౌడ్, ఉపాధ్యక్షుడు ఎంబడి మల్లేశం, కోశాధికారి శీల చంద్రశేఖర్,గుండ పవన్,గోనె సత్యం,ఐలవేని నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.