ఎమ్మెల్యేలపై ప్రజావాణిలో ఫిర్యాదులు

ఎమ్మెల్యేలపై ప్రజావాణిలో ఫిర్యాదులు– మల్లారెడ్డి, ప్రేమ్‌ సాగర్‌రావుపై భూకబ్జా ఆరోపణలు
–  ప్రజాభవన్‌ ఎదుట బాధితుల ఆందోళన
నవతెలంగాణ – బంజారాహిల్స్‌
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు తమ భూములు కబ్జా చేశారంటూ శుక్రవారం బాధితులు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రజాభవన్‌ ముందు ఆందోళనకు దిగారు. మేడ్చల్‌ జిల్లా గుండ్ల పోచంపల్లిలో సర్వేనెంబర్‌ 648/650లోని తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి బాధితులు పెద్దఎత్తున వచ్చారు. శ్రీ మల్లికార్జున నగర్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీలోని తమ భూములను మల్లారెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. మల్లారెడ్డి నుంచి భూములను కాపాడాలని.. సీఎం రేవంత్‌ రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరారు.
మరో వైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్‌ ప్లాట్‌ ఓనర్స్‌ ప్రజావాణి వద్ద నిరసన చేపట్టారు. కాప్రా సర్వేనెంబర్‌ 647/1, 648 డ 654లో భూమిని మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జా చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్‌ రెడ్డి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.