– వడ్డెకొత్తపల్లి లో పోషణ పక్వాడ్ పై అవగాహన
నవతెలంగాణ – పెద్దవంగర: ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తొర్రూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ హైమవతి, ఎం.ఎల్.హెచ్.పీ రాజ్ కుమార్ అన్నారు. వడ్డెకొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కవితా రెడ్డి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు, కిశోరబాలికలు పోషణ పక్వాడ్ పై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహారం లోపం తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణ కోసం ప్రతి ఒక్కరూ పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల గర్భిణులు రక్తహీనత బారిన పడుతున్నారని పేర్కొన్నారు. తద్వారా ప్రసవ సమయంలో సమస్యలు రావడం, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా లేకపోవడం, సరైన ఎదుగుదల లేకపోవడం వంటి రుగ్మతలకు దారి తీస్తుందన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల నుంచి అందించే పాలు, గుడ్లు, పోషకాలతో కూడిన భోజనాన్ని తీసుకోవాలన్నారు. సరైన పోషక నిల్వలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇతరత్ర అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, దీనిని అధిగమించడానికి మన చుట్టూ ఉండే ఆకుకూరలు, మునగ, ఉసిరి, జొన్నలు, సజ్జలు ఇతర చిరుధాన్యాలు తినాలన్నారు. అనంతరం మెరుగైన ఆరోగ్యం కోసం పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కాగా పోషణ పక్వాడ్ కార్యక్రమం ఈ నెల 9 నుండి 23 వరకు జరుగుతాయని సీడీపీఓ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోషకాహారం స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మురళీ, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ అశోక్, ఏఎన్ఎం బూబ, అంగన్వాడీ టీచర్లు సుకన్య, అరుణ, మంజుల, రేణుక, సునీత, అండాలు, సరళ, నీలవేణి ఝాన్సీ, స్వరూప ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.