పూర్తయిన ప్రాణ ప్రతిష్ట

Complete Prana Prastha– మోడీ చుట్టే తిరిగిన అయోధ్య ఈవెంట్‌
– అంతా తానై నడిపిన ప్రధాని
– బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల కనుసన్నలలో కార్యక్రమం
– ప్రధానిపై పోటీ పడి ప్రశంసలు
– మతానికీ ప్రభుత్వానికీ మధ్య చెరిగిన రేఖ
అయోధ్య : సుదీర్ఘకాలం ఎదురు చూసిన తర్వాత రాముడు తన ఇంటికి వచ్చాడని ప్రధాని మోడీ అన్నారు. ‘ఎన్నో చెప్పాలని అనుకున్నాను. కానీ నా గొంతు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మన రామ్‌ లల్లా ఇకపై టెంటులో ఉండడు. ఆలయంలో ఉంటాడు. ఇది క్యాలండర్‌లో ఒక రోజు కాదు. నూతన కాలచక్రానికి ఆరంభం’ అని చెప్పారు. అనేక శతాబ్దాల పాటు రాముడిని వేచి ఉండేలా చేసినందుకు క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. దేశం యావత్తూ నేడు దీపావళిని జరుపుకుంటోందని మోడీ తెలిపారు.
అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరంలోని రామ్‌ లల్లా విగ్రహానికి సోమవారం జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం యావత్తూ ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూనే తిరిగింది. ప్రాణ ప్రతిష్ట సమయంలో జరిగిన క్రతువులో మోడీ అంతా తానై వ్యవహరించారు. మోడీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, రాష్ట్ర గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ మినహా మరెవ్వరినీ గర్భగుడిలోకి అనుమతించలేదు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం ఎనిమిది నిమిషాల పాటు కొనసాగింది. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన బాల రాముడి విగ్రహం 51 అంగుళాల పొడవు ఉంది. వివిధ రకాల ఆభరణాలతో విగ్రహాన్ని అలంకరించారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్‌ యోగి రాజ్‌ ఈ విగ్రహాన్ని రూపొందించారు.
దేవాలయ నిర్మాణం వచ్చే సంవత్సరం కానీ పూర్తి కాదు. ఇప్పటి వరకూ కేవలం మొదటి అంతస్తు నిర్మాణం మాత్రమే జరిగింది. కార్యక్రమాన్ని దేశంలోని అన్ని ప్రధాన టీవీ ఛానల్స్‌లోనూ, సామాజిక మాధ్యమాలలోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. మోడీ, భగవత్‌, ఆదిత్యనాథ్‌, ఆనందిబెన్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరిలో కూడా కేవలం మోడీ పైనే కెమేరా ఫోకస్‌ అయింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులనేకులు హాజరయ్యారు. ప్రతిపక్షాల నేతలెవరూ కనిపించలేదు. సోనూ నిగమ్‌, శంకర్‌ మహదేవన్‌, అనురాధ పౌడ్వాల్‌ ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.
ప్రధానిపై పొగడ్తలు
ప్రార్థనల అనంతరం పండితులు, రాజకీయ నాయకులు అతిథుల వద్దకు చేరుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి, ట్రస్టీ గోవింద దేవ్‌ గిరీజీ మహరాజ్‌ ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారు. ఛత్రపతి శివాజీ వంటి మరో మహారాజును మోడీ గుర్తుకు తెచ్చారని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం కోసం మోడీ ఉపవాస దీక్ష చేశారని, నేలపై నిద్రించారని అంటూ ఈ ఆచారాలను మోడీ తన తల్లి నుండి అలవరచుకున్నారని, 40 సంవత్సరాలుగా వీటిని ఆచరిస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశంలో నేడు నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని కూడా ప్రస్తావించారు. అయితే దానిపై వివరణ ఇవ్వలేదు.
మోడీ విజయం వల్లనే కల సాకారమైంది : యోగి ఆదిత్యనాథ్‌
మనం తిరిగి త్రేతాయుగంలో ప్రవేశించినట్లు అన్పిస్తోందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. దేశంలోని మెజారిటీ ప్రజలు సుదీర్ఘ కాలం కృషి చేసి ఈ దేవాలయాన్ని పొందగలిగారని చెప్పారు. రామ మందిరానికి వాస్తవ రూపం అందించేందుకు కులాలు, వర్గాలకు అతీతంగా హిందువులు చేసిన త్యాగాలను ఆయన ప్రస్తావించారు. 2014 ఎన్నికల్లో మోడీ విజయం సాధించడం వల్లనే హిందువులు తమ కలను సాకారం చేసుకోగలిగారని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ కూడా మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మోడీ ఓ సన్యాసి అని, అది తనకు తెలుసునని చెప్పారు.
ఆ రేఖ చెరిగిపోయింది
మతపరమైన కార్యక్రమంలో మోడీ క్రియాశీలకంగా వ్యవహరించ డాన్ని గమనిస్తే ప్రభుత్వానికి, మతానికి మధ్య ఉన్న సూత్రప్రాయ మైన దూరం అస్పష్టంగా ఉన్నదని, దానిని అర్థం చేసుకోవడం కష్టమని పండితులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒక లౌకిక దేశంగా భారత్‌ పునాదిని ఈ దూరం నిర్దేశిస్తోందని తెలిపారు. ‘ఒకరు రాజు మాదిరిగా వ్యవహరిస్తున్నారు. తనలో దైవత్వం ఉన్నదని ఆయన ప్రకటించాడు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తనను దైవం ఎంచుకున్నాడని భావించాడు. దీనిని ఏమంటారు? ప్రభుత్వానికి, మతానికి మధ్య ఉన్న రేఖ చెరిగిపోయింది. మతం, మత కార్యక్ర మాలను ఎలా నిర్వహించాలో ప్రభుత్వం నిర్దేశించినప్పుడే ఆ రేఖ చెరిగిపోయింది’ అని రాజకీయ శాస్త్రవేత్త రాజీవ్‌ భార్గవ తెలిపారు.