నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతుల పనులను వేసవి సెలవులు ముగిసేలోపు పూర్తి చేయాలని కలెక్టర్ బీ.ఎం. సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టాల్సిన నిర్మాణపు పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులన్నింటినీ గ్రౌండింగ్ చేసి మే, 3వ తేదీ నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. చేపట్టే పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వేగవంతంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు వారాంతపు నివేదికలను తప్పనిసరిగా అందజేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడే తెలియజేయాలని సూచించారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో కమిటీలతో పాటు ప్రతి మండలానికి నోడల్ అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పాఠశాలల్లో అవసరం మేరకు.. తరగతి గదుల తాత్కాలిక మరమ్మతులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతుల కల్పనకు పనులను చేపట్టి ఈ మాసం వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, డీిఆర్డీఓ నర్సింగరావు, డీఈవో ఇందిర, ఎంఈఓలు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.