పూరణ

పూరణయుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినప్పుడే
సముద్రం బిక్కచచ్చిపోయింది
అలలపై విరుచుకుపడినప్పుడే
కలలు కందిపోయాయి
ఇక, పగలైనా రాత్రయినా-
కమ్ముకునేది చీకటేనని అప్పుడే తెలిసిపోయింది
చెట్ల మీద గూళ్లలో గుడ్లు ఎదురుచూస్తున్నప్పుడే
పొదగాల్సిన పక్షులు తూటాల మధ్య
కలవరపడినట్టు కబురొచ్చింది
పురిటి నెప్పులేవీ బాంబు పేలుళ్ల నడుమ వినబడలేదు
పాలసీసాలు పగిలిపోయిన ఆ క్షణమే
పాలస్తీనా అమ్మతనం నేలపాలైంది
తొమ్మిది నెలల కలల స్తన్యం పొలమారింది.
విరిగిపోయిన ఇంద్ర ధనస్సు
శిథిలాల మధ్య చెదిరిపడింది
దాన్లో తమ ముఖాలను పోల్చుకోలేక
పిల్లలు గుక్కపెట్టారు
గుట్టలుగా పోగుపడుతున్న శవాల మధ్య
కొన ఊపిర్లు మనుషుల బుక్‌మార్క్‌ లవుతున్నాయి
ఆరడుగులుండే దేహానికి
ఆరించులైనా లేని నోటితో..
నినాదాన్ని పూరించలేని తల్లిదండ్రులు
దుఃఖాన్ని తమ పాడె మీదకే ఎత్తుకుంటున్నారు
గళ్ల నుడికట్టులో పూడ్చేయగా మిగిలిన ఖాళీలను
ఇప్పుడిక ఎవరి ఆత్మలతో పూరిస్తావురా?
పిల్లలా? తల్లులా? తండ్రులా??
-లేదూ, చివరాఖరిగా మిగిలే నీతోనా?
– దేశరాజు