యుద్ధం కంపోజ్‌ చేసిన

Composed by Warవిషాద గీతాన్ని…
కల్లో, సారానో సాక పోసినట్టు
రక్తం సాకబోత
సొంత నేలకోసం
మనుషులు ఆరబోత

కూలిన మొండి గోడల మధ్య
తెగిపడిన మాంసపు ముద్దల నడుమ
రక్తబంధాలన్ని చెల్లా చెదురుగా పడి ఉన్నాయి
అమ్మా, నాన్నా , అక్కా, తమ్ముడూ
తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న
ఏ మాంసం గడ్డ ఎవరిదో

నేను…
నేను… ఇప్పుడు కండ్లకు
దుఃఖపు పొరలు కమ్ముకున్న
విషాదాన్ని
పాలస్తీనా బిడ్డను…

నా నేలకు నేను పరాయిని
నా నేలకు నేనే శరణార్థిని
నా నేలకు నేనే ప్రవాసిని
అయినప్పుడు
నా నేల మీద నేను శవాన్ని.

ముక్కలు ముక్కలైన పసినవ్వులు
ముక్కలు చెక్కలైన బుజ్జిబుజ్జి మాటలు
విరిగిపడిన బుడిబుడి నడకల
ప్రతిరూపాన్ని …
యుద్ధం కంపోజ్‌ చేసిన
విషాద గీతాన్ని… నేను

అయినా,
ఆత్మస్థైర్యంతో పోరాడుతూనే ఉంటాను
దుఃఖ గీతాన్ని ఆలపిస్తున్న
నిలువెల్ల గాయాలను మానిపేందుకు
శిధిల భవనాలు కింద
పోరాట అక్షరాలు నేర్చుకుంటున్న
పాలస్తీనా బిడ్డను నేను
– అనంతోజు మోహన్‌కష్ణ