రూ.34 వేల కోట్లతో సమగ్రాభివృద్ధి

– వ్యవసాయరంగానికి పెద్దపీట
– విద్య,వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు
– విద్యుత్‌ రంగంలో సంచలన విజయాలు
– రూ.1,558.18 కోట్లతో వెలుగు జిలుగులు
– 13.2 శాతానికి పెరిగిన రాష్ట్ర వృద్ధి రేటు
– శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసింగ్‌ భేష్‌
– రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
గడిచిన తొమ్మిదేండ్లలో రూ.34 వేల కోట్లతో సూర్యాపేట జిల్లా సమగ్రాభివృద్ధికి ఖర్చు చేశామని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.అందులో వ్యవసాయ రంగానికి వాటి అనుబంధ విభాగాలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యా,వైద్య రంగంలో విప్లవాత్మక మైన మార్పులకు నాంది పలికారని కొనియాడారు. విద్యుత్‌ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయాలతో తెలంగాణా రాష్ట్రం యావత్‌ భారత దేశానికే రోల్‌మోడల్‌గా మారిందన్నారు.తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లాకేంద్రంలోనీ పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ఆయన ప్రారంభించారు.అంతకుముందు ఆయన పరేడ్‌ గ్రౌండ్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.అనంతరం మంత్రి పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణా ఆచరిస్తుంది…
దేశం అనుసరిస్తుందన్న మాటలు నేడు వాస్తవరూపం దాల్చాయన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూపిన దార్శనికతనేకారణమని ఆయన కితాబిచ్చారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 13.02 శాతానికి పెరిగిందన్నారు.అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 10.02 శాతానికి తగ్గిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకీ నెట్టినా ఆ కుదుపు నుండి అనతికాలంలోనే తెలంగాణా బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతుందన్నారు.అది ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనత మాత్రమేనన్నారు.సీఎంకేసీఆర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహజంగానే వ్యవసాయం వాటి అనుబంధ సంఘాలకు పెద్ద పీట వేశారని చెప్పారు.రూ.40007 కోట్లను వ్యవసాయం, ఉద్యాన వనాభివృద్ధికి వెచ్చించినట్లు వెల్లడించారు.వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న నీటిపారుదల, ఆయకట్ల అభివృద్ధికి రూ.2,445.47 కోట్లు,విద్యుత్‌ శాఖకు రూ.1,558.18 కోట్లు, మిషన్‌ భగీరథ కు రూ.1,216 కోట్లు,వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ద్వారా రూ.22.50 కోట్లు ఖర్చుపెట్టామని తెలిపారు.అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గడిచిన తొమ్మిదేండ్లలో రూ.984.77 కోట్లు,విద్యాశాఖకు రూ.417.82 కోట్లతో అభివృద్ధి సాధించుకున్నమన్నారు.తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం కేవలం 6 గురుకులాలు ఉన్న సూర్యాపేట జిల్లాలో రాష్ట్రం ఏర్పాటు తరువాత 19 గురుకులాలు,2 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అదే విదంగా షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ సేవా సహకార అభివృద్ధి సంఘం నుండఊ.ి339.28 కోట్లు, అదే శాఖా ద్వారా సంక్షేమానికి రూ.138.74 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.దీంతో పాటుగా గిరిజనాభివృద్ధికి రూ.78.53 కోట్లు ఖర్చు పెట్టగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖా ద్వారా రూ.13.97 కోట్లు,మైనారిటీ సంక్షేమ శాఖా ద్వారా 27.13 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు.మహిళా, శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధులకు రూ.74.44 కోట్లు,తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావ అనంతరం పురపాలక సంఘాల అభివృద్ధికి రూ.556.57 కోట్లు,పట్టణ పేదరిక నిర్ములనకు రూ.1456.20 కోట్లు,గ్రామీణాభివృద్ధి కి 6180.90 కోట్లను వెచ్చించామని వివరించారు.మొత్తం రూ.34వేల కోట్లను సూర్యాపేట జిల్లా సమగ్రాభివృద్ధికి ఖర్చు చేసి తొమ్మిదేండ్లలో ఘననీయమైన పురోగతిని నమోదు చేసుకున్న విషయాన్ని యావత్‌ ప్రజానీకం గుర్తించాలన్నారు. సూర్యాపేట అభివృద్ధినీ సూక్ష్మంగా పరిశీలిస్తే2014 కు పూర్వం 2014 తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు.ఇంతటి అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంతో పాటు అధికారుల నిరంతర కృషి ఉందన్నారు.అంతే గాకుండా శాంతిభద్రతల రంగంలో పోలీసుల పని తీరు భేషుగ్గా ఉందని ఆయన ప్రశంసించారు.అనంతరం సాంస్కతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.ఈ సందర్భంగా శకటలా ప్రదర్శన ఆకట్టుకుంది.కలెక్టర్‌ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జదీపికాయుగంధర్‌రావు, శాసనసభ్యులు గాదరి కిశోర్‌కుమార్‌, బొల్లంమల్లయ్యయాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.