– పే స్కేల్ అమలు చేసి,ఉద్యోగ భద్రత కల్పించాలి..
– బిసి పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఇరవై ఏళ్లుగా పాఠశాల విద్య అభివృద్ధి కోసం పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని బిసి పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరానికి హాజరై వారికి మద్దతు తెలిపారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలోని అన్ని విభాగాలలో దాదాపు 19,600 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఏండ్ల తరబడిగా వారు చాలీ చాలని వేతనంతో జీవితాలు నెట్టుకొస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నారని, అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమగ్ర శిక్ష కార్యక్రమం ప్రారంభమైందని, ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పే స్కేల్ ఇస్తున్నారని, తెలంగాణలో కూడా అమలు చేసి వారిని ఆదుకోవాలన్నారు. తమ విధులనే కాకుండా ప్రభుత్వం అప్పగిస్తున్న ప్రతి పనినీ సమర్థంగా నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగుల మాదరిగానే విధులు నిర్వహిస్తున్నా కూడా వారికి పనికి తగిన వేతనం అందడం లేదన్నారు.ప్రతి ఉద్యోగికి 10 లక్షల రూపాయల జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా రూ.10 లక్షల సౌకర్యం కల్పించాలని, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్న వారికి, చేసిన వారికి బెనిఫిట్స్ కింద రూ.25 లక్షలు ఇవ్వాలన్నారు.ప్రభుత్వ, విద్యాశాఖ నియామకాల్లో వీరికి వెయిటేజ్ కల్పించాలన్నారు. ప్రభుత్వం పాఠశాల విద్య అభివృద్ధికి అదిక ప్రాధాన్యం ఇస్తుందని, కానీ గత 29 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా సిఎం స్పందించి వెంటనే వారితో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ చైర్మన్ గాలిగల్ల సాయిబాబా, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి రమణ, కోశాధికారి లక్ష్మీనారాయణ, తేజశ్రీ, స్నేహలత, రాంబాబు, సయ్ యద్ తదితరులు పాల్గొన్నారు.