సంక్షోభంలో సూరత్ వజ్రాల వ్యాపారం
సూరత్ : భారత వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉన్న సూరత్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా అశాంతే. వజ్రాన్ని తయారు చేసి, ప్రాసెస్ చేసి, పాలిష్ పట్టే పలు కంపెనీలు ఇప్పుడు తమ వద్ద పనిచేస్తున్న కార్మికులను రెండు వారాల ‘సెలవు’పై పంపాయి. సెలవు కాలంలో వారికి ఎలాంటి వేతనాలు లభించవు. ఈ నెల రెండో వారం నుంచి ఈ ‘బలవంతపు’ సెలవులు మొదలయ్యాయి. మనకు ముడి వజ్రాలు ఆఫ్రికా నుంచి దిగుమతి అవుతాయి. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ముడి వజ్రాలు రాకపోవడంతో సూరత్‌లోని 20 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేసి కార్మికులను సెలవుపై పంపాయి. సాధారణంగా సూరత్‌లోని వజ్రాల కంపెనీలలో దీపావళి పండుగకు, వేసవిలో సెలవులు ఇస్తారు. దీపావళికి 15-30 రోజులు, వేసవిలో 7-10 రోజుల సెలవు దొరుకుతుంది. కొన్ని కంపెనీలు మార్కెట్ పరిస్థితులు సరిగా లేకపోతే సెలవులు ఇస్తాయి. ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం ఏమంటే సెలవులు ఇస్తున్న యూనిట్ల సంఖ్య అధికంగా ఉండటమే.
సూరత్‌లోని వజ్రాల వ్యాపారం ప్రపంచంలోనే పెద్దది. మన దేశం నుంచి జరిగే వజ్రాల ఎగుమతులలో 90 శాతం, ప్రపంచ పాలిష్డ్ వజ్రాల ఎగుమతులలో 80 శాతం ఇక్కడ నుంచే జరుగుతాయి. అయితే వాణిజ్య పోటీ, కరెన్సీ ఒడిదుడుకులు, పర్యావరణ అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి పలు కారణాల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా వజ్రాల వ్యాపారం పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. సూరత్‌లో 5,600 వజ్రాల కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఏడున్నర లక్షల మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం 200 కంపెనీలు కార్యకలాపాలు నిలిపివేశాయని గుజరాత్ వజ్రాల కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు భవేష్ టాంక్ చెప్పారు. దీంతో సుమారు మూడు లక్షల మంది కార్మికులపై ప్రభావం పడిందని తెలిపారు. తరచుగా సెలవులు ప్రకటించడం, సామాజిక భద్రత లేకపోవడం వల్ల కార్మికులు అయోమయంలో ఉన్నారు. పైగా కొన్ని కంపెనీలు తమ పనులను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడంతో కార్మికుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు తయారైంది. పైగా వజ్రాల పరిశ్రమ పూర్తిగా విదేశాలపై ఆధాపడి ఉంది. దీంతో ఇక్కడ కంపెనీల చేతిలో నియంత్రణ ఏమీ లేకుండా పోతోంది. చైనాలో ఆర్థికాభివృద్ధి మందగించడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో స్థానిక మార్కెట్‌లో స్తబ్దత నెలకొంది. రష్యా నుంచి వజ్రపు రాళ్ల సరఫరా నెమ్మదించిందని, పైగా ఇప్పుడు అంతర్జాతీయంగా వజ్రాలకు డిమాండ్ లేకుండా పోయిందని కంపెనీల యజమానులు చెబుతున్నారు. అమెరికాలో బ్యాంకుల సంక్షోభం కూడా పరిస్థితిని మరింత దెబ్బతీసిందని వారు తెలిపారు. ఇలాంటప్పుడు కార్మికులకు సెలవులు ఇవ్వడం మినహా చేసేదేమీ లేదని అన్నారు. కొన్ని కంపెనీలు మాత్రం కార్మికులకు సగం వేతనం ఇస్తూ ఎలాగొలా నెట్టుకొస్తున్నాయి.