– ప్రజాపాలనతో వికలాంగునికి ఉపాధి
– రెండు చేతులు లేకున్నా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు
నవతెలంగాణ-కాగజ్‌నగర్
పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినా అతను ఎక్కడా అధైర్యపడలేదు. తానూ అందరితో సమానమయ్యాడు. తన కాళ్లనే చేతుల్లా మార్చుకున్నాడు.. ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ప్రతి ఒక్కరినీ ఆభ్యర్థించాడు. దరఖాస్తులు చేసుకున్నాడు. అయినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ప్రస్తుతం ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కోసం మున్సిపల్ కార్యాలయంలో ఆపరేటర్లు అవసరం ఉండటంతో మున్సిపల్ కమిషనర్ అంజయ్యను కలిసి కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరాడు. ఇదీ కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణం చారిగాం రోడ్డుకు చెందిన జాకీర్ పాషా నేపథ్యం. ఇతను ఎంకాం పీజీడీసీఏ పూర్తి చేశాడు. ప్రస్తుతం కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాడు. కాళ్లతో దరఖాస్తులను చాకచక్యంగా కంప్యూటర్‌లో నమోదు చేస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆయన పనితనాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.
28 మంది ఆపరేటర్ల నియామకం
కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు కోసం 28 మంది ఆపరేటర్లను నియమించినట్టు మున్సిపల్ కమిషనర్ అంజయ్య తెలిపారు.
ఈ క్రమంలో రెండు చేతులు లేని జాకీర్‌పాషా కలువడంతో అతనికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో విద్యార్హతలు చూసి కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించినట్టు తెలిపారు. మొత్తం మున్సిపల్ వ్యాప్తంగా 16,807 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 17 వరకు మొత్తం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 5,170 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేశామన్నారు.
కాళ్లతోనే కంప్యూటర్ ఆపరేటింగ్
1:32 am