బీవీకే ఆధ్వర్యంలో కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం

– ప్రారంభించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బివికె) ఆధ్వర్యంలో ఖమ్మం సుందరయ్య భవనంలో ”వాసిరెడ్డి శేషమ్మ-మంగయ్య మెమోరియల్‌” వారి సౌజన్యంతో ”కంప్యూటర్‌ శిక్షణా కేంద్రం” ప్రారంభించారు. స్కూలు విద్యను అభ్యసించే పిల్లలకు చిన్నతనంలోనే కంప్యూటర్‌ శిక్షణలో మెళకువలు నేర్పించేందుకు, వారి భవిష్యత్‌ చదువులలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఉద్దేశించి ప్రారంభించిన ఈ కేంద్రాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, బివికె చైర్మెన్‌ తమ్మినేని వీరభద్రం రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించారు. బివికె జనరల్‌ మేనేజర్‌ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, గతంలో కోవిడ్‌ 2 వేవ్‌ల సందర్భంగా రోగులకు ఐసోలేషన్‌ సెంటర్‌ నిర్వహించడం, రోగులకు, కుటుంబ సభ్యులకు ఉచిత భోజనాలు అందించటం, విద్యార్థుల సౌకర్యార్థం లైబ్రరీ నడపటం, ప్రతి నెల ఉచిత మెడికల్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సేవా కార్యక్రమాల కొనసాగింపులో భాగంగానే ఈ శిక్షణా కేంద్రం కూడా ప్రారంభించామన్నారు. బీవీకే ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా ఈ కంప్యూటర్‌ శిక్షణా కేంద్రానికే కాకుండా ఇతర అన్ని కార్యక్రమాలకు సహకరిస్తున్న వాసిరెడ్డి దయానంద్‌కి, వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కేంద్రాన్ని వినియోగించుకోవల్సిందిగా ఆయన విద్యార్థులను కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ సీపీఐ(ఎం) మరియు బివికె సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ శిక్షణా కేంద్రాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. అదే విధంగా బివికె నిర్వహించే అన్ని కార్యక్రమాలకు సహకారిస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వాసిరెడ్డి దయానంద్‌కి, వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్‌లో నిర్వహించబోయే అన్ని కార్యక్రమాలకు కూడా ఇదే సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మరొక ముఖ్య అతిథి, ప్రముఖ విద్యావేత్త ఐ.వి.రమణారావు మాట్లాడుతూ కంప్యూటర్‌ విజ్ఞానాన్ని పిల్లలకు అందించడానికి బివికె చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.
నిశాంత్‌ ఇంజం వాసిరెడ్డి దయానంద్‌కు సత్కారం
అమెరికాలో స్థిరపడిన నిశాంత్‌ ఇంజంను, బివికె కార్యక్రమాలకు సహకరిస్తున్న వాసిరెడ్డి దయానంద్‌ని శాలువా కప్పి సత్కరించారు. ముఖ్యంగా నిశాంత్‌ ఇంజం ”ద బెస్ట్‌ పాసిబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌” అనే ఒక 11 షార్ట్‌ స్టోరీస్‌ పుస్తకం ద్వారా భారత సంతతి ప్రజలు అమెరికా సమాజంలో ఇమిడే క్రమంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులు, కోల్పోయే ఐడెంటిటీ, కుటుంబ విలువలు, ప్రేమ మొదలగు వాటి గురించి ఎంతో హృద్యంగా మనసుకు హత్తుకొనేలాగా రాసి ఎంతోమంది హృదయాలను జయించాడని, ఇది అద్భుతమని హాజరైన అతిథులందరూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.సుబ్బారావు, బండి రమేష్‌, వై.విక్రమ్‌, బండి పద్మ, నందిపాటి మనోహర్‌, ఎర్ర శ్రీనివాసరావు, జబ్బార్‌, ఆర్‌.ప్రకాష్‌, నవీన్‌ రెడ్డి, యస్‌.కె.బషీరుద్దీన్‌, బోడపట్ల సుదర్శన్‌, మీరా, కళ్యాణం నాగేశ్వరరావు, పగడాల నాగేశ్వరరావు, చింత కోండల్‌ రావు, బి వి కె బాధ్యులు శివన్నారాయణ ఎస్‌.కె.అఫ్జల్‌, నన్నక గోవిందరావు, తుమ్మల వెంకట్రావు, వాసిరెడ్డి వీరభద్రం, నెల్లూరి వీరబాబు, ఆల్‌ పెన్షనర్స్‌ Ê రిట్కెర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు, బివికె విద్యార్థులు పాల్గొన్నారు.