అసమాన ధైర్యశాలి, అడవితల్లి ముద్దుబిడ్డ… కామ్రేడ్‌ చంద్రరావు

Unparalleled bravery, the darling of the wild mother... Comrade Chandra Raoఇటీవలే కామ్రేడ్‌ భీష్మారావు 39వ వర్ధంతి జరిగింది. డిసెంబర్‌ 13 కామ్రేడ్‌ చంద్రరావు వర్థంతి.1985వ సంవత్సరంలో జరిగిన ఈ ఘటనలు ఎందుకో ఇప్పటికీ తడారని జ్ఞాపకాలుగానే ఉన్నాయి.
అప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. ఆ ఘటనలో వీరమరణం పొందిన నా జీవిత భాగస్వామి కామ్రేడ్‌ భీష్మారావు వయసు 36. నెల రోజుల తర్వాత జీడిగుప్ప అడవిలో ఆ ప్రాంతానికి వెళ్లి, దారపల్లి వాగు పక్కన, అమరుల రక్తంతో తడిచిన మట్టిని పట్టుకొని, భావోద్వేగంతో ప్రతిజ్ఞ చేసిన రోజు నాకు మరువలేని జ్ఞాపకం. ఈరోజు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా బాధ్యతల్లో ఉన్న నా ఉద్యమ ప్రస్థానం ఆనాడు చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో మొదలైందే.
భద్రాచలం డివిజన్‌లోని ఆదివాసీల పక్షాన నిలబడి ఎర్రజెండా నీడలో వెట్టిచాకిరి, మేకల పుల్లరి, కాంట్రాక్టర్ల దోపిడీ, అటవీ, పోలీసు, రెవెన్యూ అధికారుల దారుణమైన దోపిడీ, నిర్బంధాలు, దాష్టీకాలకు వ్యతిరేకంగా ఆనాడు జరిగిన పోరాటాలను చూస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గుర్తుకొస్తాడు.
కామ్రేడ్‌ బిసిఆర్‌ 18 సంవత్సరాల వయస్సులో దేశంలో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటం చూసి ఉత్తేజితులై ప్రజా పోరాటాల్లో పాల్గొంటూ వచ్చారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రజలపై జరుగుతున్న దోపిడీ, అణచివేతలను చూసి చలించిపోయి ఈ ప్రజల కోసం పూర్తికాలం పనిచేయాలని అనుకున్నారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలో పని చేయటం అంటే కత్తి మీద సాములాంటిది. శత్రువుల దాడుల మధ్య పనిచేయవలసి వచ్చేది. వాగులు, వంకలు, సెలయేర్లతో నిండి ఉన్న భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు.ఎటు వెళ్లాలన్నా కార్యకర్తలు కాలినడకన వెళ్లేవారు. ఒక జత బట్టలతో నాలుగు ఐదు రోజులు గ్రామాల్లోనే గడిపిన సందర్భాలున్నాయి. గ్రామాల్లో బియ్యం కూడా దొరికేవి కావు. కేవలం దుంపలు, అంబలి తాగి ఉండేవారు.
1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినపుడు కా|| టివిఆర్‌ చంద్రం, కా|| చంద్రరావు పదహారు నెలలపాటు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఎమర్జెన్సీ అనంతరం కా||టివిఆర్‌ రాష్ట్ర కేంద్రం విజయవాడకు వెళ్లారు. ఎమర్జెన్సీ కాలం నుండే పార్టీ కార్యదర్శిగా బిసిఆర్‌ పనిచేశారు. ఇటువంటి కఠినతరమైన పరిస్థితుల్లో భద్రాచలం నియోజకవర్గంలో 1978 నాటికి బిఎస్‌ రామయ్య, యలమంచి సీతారామయ్య, మార్త శ్రీరామ్మూర్తి లాంటి అనేకమంది తన సహచరులతో కలిసి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం గెలుచుకునేంత బలమైన పార్టీని నిర్మించారు.
ఈ పరిస్థితుల్లో భద్రాచలం డివిజన్‌ టింబర్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ స్థాపించి అధ్యక్ష కార్యదర్శులుగా బండారు చంద్రరావు, బత్తుల భీష్మారావు అనేక మిలిటెంట్‌ ఉద్యమాలను నడిపారు. ఫారెస్టు, పోలీసువారు భద్రాచలం పేపర్‌బోర్డు యాజ మాన్యం, కాంగ్రెస్‌వారు కలిసి అనేక కేసులలో ఇరికించేవారు. ఆయన నాయకత్వంలో అనేకమంది కార్యకర్తలు ఆకర్షితులయ్యారు. పార్టీలతో నిమిత్తం లేకుండా పేద ప్రజలు ఈ పోరాటాలలో పాల్గొన్నారు. గ్రామాలకు గ్రామాలు వేలాదిగా ప్రజలు పార్టీవైపు ఆకర్షితులయ్యారు. సీపీఐ(ఎం) పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కక్ష కట్టి అనేకసార్లు హత్య ప్రయత్నాలకు పాల్పడింది, దాడులు చేసింది. అప్పటికే మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాల అటవీ ప్రాంతంతో కలగలిసి ఉన్న ఈ ప్రాంతంలో పట్టు సాధించాలని చూస్తున్న పీపుల్స్‌వార్‌ గ్రూపు కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై మార్క్సిస్టు పార్టీని ఉమ్మడి శత్రువుగా చేసుకున్నాయి. దాడులలో ఒకరికొకరు సహకరించుకున్నాయి. ‘మార్క్సిస్టు పార్టీని వదిలేసి ఇంకా ఏ పార్టీలోనైనా చేరండి.. లేకపోతే చంపుతాం’ అని పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ నక్సలైట్స్‌ 1980 నుండి బెదిరింపులు మొదలుపెట్టారు. అన్ని మండలాల్లో దాడులు చేశారు. బిసిఆర్‌ను చంపుతామని కబురు పెట్టడం, బెదిరింపు లేఖలు రాయడం చేశారు. ”మీరు మా ప్రాణాలు తీస్తే మా ప్రజలు మిమ్ముల్ని తరిమికొడతారు” అని ప్రజా చైతన్యం పట్ల విశ్వాసంతో వారిని హెచ్చరికలను లెక్కజేయలేదు కామ్రేడ్‌ చందర్రావు. 1982లో చందర్రావు గారి సోదరుల కుటుంబాలపై గోళ్లగట్ట గ్రామంలో దాడి చేసి ”మీ తమ్ముడిని అదుపులో పెట్టండి లేదా చంపుతామని” వారిని చేతులు విరగ్గొట్టి బెదిరించి వెళ్లారు. ఇలాగే కుంజా బొజ్జి, శ్యామల వెంకటరెడ్డి, యలమంచి సీతారా మయ్య, పులి రామయ్య, చింతూరు వెంకట్రావు, స్వరాజ్యేశ్వ రమ్మ, పాయం సీతమ్మ వంటి అనేకమంది నాయకులకు హెచ్చరికలు చేశారు.
చివరికి 1985 నవంబర్‌ 5న జీడిగుప్ప గ్రామంలో దారికాసి అప్పటికే నాలుగు రోజులుగా పర్యటనలో ఉన్న పార్టీ నాయకులను దట్టమైన అటవీ ప్రాంతం జీడిగుప్పలో జీపును అడ్డగించి కత్తులు, గొడ్డళ్లతో హతమార్చారు. బత్తుల భీష్మారావు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. బండారు చంద్రరావు చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి డిసెంబర్‌ 13న హైదరాబాదులోని హాస్పిటల్‌లో మరణించారు.ఎమ్మెల్యే కుంజా బొజ్జి కోలుకున్నారు. వారి మరణాలను చూసిన భద్రాచలం నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున సమీకృతులై హత్యా రాజకీయాలను తిప్పికొట్టారు. విల్లంబులు ధరించి గ్రామాలను కాపాడుకున్నారు. కొన్నేండ్ల పాటు గ్రామాల్లోకి, ప్రజల మధ్యకి రాలేక నక్సల్స్‌ దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.1988లో గిరిజన నాయకుడు పులి రామయ్యను దారుణంగా నరికి చంపారు. 1996లో శ్యామల వెంకటరెడ్డిగారిని హత్య చేశారు. భద్రాచలం నియోజకవర్గంలో పదుల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలను హత్యలు చేసినా పార్టీని లేకుండా చేయటం వాళ్ల తరం కాలేదు. కార్యకర్తలు, నాయకులతో పాటు చనిపోయిన కుటుంబాలకు చెందిన భార్య బిడ్డలు కూడా కదిలి ఈ ఉద్యమాన్ని కాపాడటానికి నడుం కట్టారు. అందుకే ప్రజలు వెనకడుగు వేయకుండా పార్టీ వెనక నిలబడ్డారు.
అనేక డజన్ల కొద్దీ స్థానిక సంఘాలను నిర్మించడం కామ్రేడ్‌ బీసీ ప్రత్యేకత. ప్రజా సంఘాలను స్వతంత్రంగా ప్రజాతంత్ర పద్ధతిలో నడిపించేవారు. అంగన్వాడీ సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలుత పురుడు పోసుకున్నది భద్రాచలంలోనే. పార్టీ శాఖలను సక్రమంగా నడపడంలోను, మారుమూల గ్రామాలకు కూడా ప్రజాశక్తి పత్రికను అందుబాటులో ఉంచేం దుకు కృషి చేసింది. కార్యకర్తల కుటుంబాల సభ్యులతో అత్యంత ప్రేమపూర్వక సాన్నిహిత్య సంబంధాలు నాయకులకు ఉండేవి.
ఇలాంటి దాడులు, ఆందోళనకర పరిస్థితుల్లో కూడా ఎన్నికల రంగంలో పార్టీ విజయ పరంపర కొనసాగించింది. 1978-83లో ముర్ల ఎర్రయ్యరెడ్డి, 1985-89, 1994లలో మూడుసార్లు కా||కుంజా బొజ్జి, ఆ తర్వాత సున్నం రాజయ్య మూడు సార్లు మొత్తం ఎనిమిది దఫాలుగా ఎన్నికయ్యారు. పోలవరం ముంపు పేరుతో భద్రాచలం నియోజకవర్గం రెండు ముక్కలయ్యేవరకూ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా సాధించుకుంటున్న అభివృద్ధి వనరుల్ని ఎమ్మెల్యేల సహాయంతో మరింత ముందుకు తీసుకెళ్లారు. నియోజకవర్గంలో విద్యా, వైద్యం, తాగు నీరు, సాగునీరు, రహదారుల వంటి అనేక ప్రాథమిక సౌకర్యాల కోసం అహర్నిశలూ కషిచేస్తూ గ్రామాలను ప్రగతిపథంలో నడిపించారు. అమరవీరుల మార్గదర్శకత్వంలో ఆదర్శ ప్రజాప్రతినిధులుగా సేవలందించారు. డా||మిడియం బాబూరావు భద్రాచలం పార్లమెంటు సభ్యులుగా అటవీ హక్కుల చట్టం రూపకల్పనలో 14వ లోక్‌సభలో కీలకమైన పాత్ర పోషించారు.
నేడు కమ్యూనిస్టులుగా మనం గర్వించదగ్గ విజయాలు ఉన్నాయి. పార్టీ కృషితో ప్రజలకు అనేక ఉపశమనాలు సాధించాము. 2004లో 64 మంది లెఫ్ట్‌ పార్టీల ఎంపిల మద్దతుతో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం లెఫ్ట్‌ ఒత్తిడితో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, దేశవ్యాప్తంగా రైతుల రుణాల మాఫీ, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, మధ్యాహ్న భోజన పథకం లాంటి సౌకర్యాలకు నేడు బీజేపీ సర్కార్‌ నుండి ప్రమాదం ఏర్పడింది. ఈ హక్కులు కాపాడుకుంటూ బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు అంకితమై పనిచేయడమే మన నాయకులకు మనమర్పించే నివాళి.
ఆనాడు వాళ్లు హత్యకు గురైనపుడు.. నాతో సహా నాలాంటి యువతీ యువకులందరూ చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసి ముగిస్తాను.
”జీవన స్రవంతి, విప్లవం, ప్రగతి, ఏ దేశంలో కానీ…. ఏ కాలంలో కానీ… నాయకుల మరణాలతో ఆగిపోయేవి కావు. కార్యక్రమంలో వారి వారసులే సమాజాన్ని విప్లవపదంలో మునుముందుకు గొనిపోతారు. రగులుకున్న ఆ అగ్ని కణాల జీవన పోరాటమే సాక్షిగా మునుముందుకే సాగుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం”..
(నేడు కామ్రేడ్‌ బండారు చంద్రరావు 39వ వర్థంతి)
బి.హైమావతి
9490098023