నవతెలంగాణ – భువనగిరి
1915లో లెనిన్ ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని రష్యా దేశంలో అంతర్యుద్ధంగా మార్చి కార్మిక వర్గం ద్వారా విప్లవాన్ని విజయవంతం చేశారని సీపీఐజిల్లా కార్యదర్శి గోదశ్రీరాములు తెలిపారు. సోమవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో లెనిన్ మహోపాధ్యాయుని 154 వ జయంతి నీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశంలో రోజురోజుకు నిరుద్యోగం, ఆకలి, అసమానతలు పెరిగిపోతున్నా యన్నారు. దేశంలో 60 శాతం సంపద ఒక శాతం మంది కార్పొరేట్ వ్యక్తుల దగ్గర ఉందని అన్నారు. పదేండ్ల మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు రుణ మాఫీలు ప్రకటిస్తూ ప్రజలపై పన్నుల భారాన్ని, అధిక ధరల భారాన్ని మోపిందన్నారు. నేడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి గెలుపొందడం కోసం మతోన్మాద బీజేపీ పార్టీ రాజ్యాంగ సంస్థలను తమ జేబు సంస్థగా వాడుకుంటుందన్నారు. సీపీఐ, ఈడీ, ఎన్ఐఏ లాంటి సంస్థలను ఉద్యమకారులు, ప్రతిపక్ష నాయకులపై ప్రయోగించి అక్రమ అరెస్టులను చేస్తుందన్నారు. ప్రజల వ్యక్తిగత మత విశ్వాసాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎలాగైనా ఎన్నికల్లో గెలుపొందాలనే కుటిల రాజకీయాలు చేస్తుందన్నారు. వేల కోట్ల రూపాయలను ఎలక్ట్రోరల్ బాండ్ల పేరుతో దోచుకుందన్నారు. గిట్టుబాటు ధర అడిగినందుకు ఢిల్లీలో రైతాంగం పై కాల్పులు జరిపి చంపివేసిందన్నారు. ప్రజా ఉద్యమాలే దేశంలో ఫాసిస్ట్ ప్రమాదాన్ని ఓడించగలవన్నారు. దేశాన్ని గంప గుత్తగా కార్పోరేట్లకు తాకట్టు పెట్టిన బిజెపి పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అనిల్ కుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎశాల అశోక్,ఏఐవైఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ ,డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్ష కాసపాక దయాకర్, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల లింగస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్,కొమ్ము బాల నరసింహ పాల్గొన్నారు.