కామ్రేడ్‌ సరోజ్‌ చౌధురి అమర్‌రహే..

బీమా ఉద్యోగుల ప్రియతమ నాయకుడు కామ్రేడ్‌ సరోజ్‌ చౌదురి 17జూన్‌ 1999న మరణించారు. ఆయన భౌతికంగా దూరమై 24సంవత్సరాలు అవుతోంది. కానీ ఆయన ఇన్సూరెన్స్‌ రంగానికి చేసిన సేవలు మాత్రం చిరస్మరణీయం. భారత కార్మికోద్యమంలోను, ముఖ్యంగా బీమా ఉద్యోగుల ఉద్యమాన్ని ‘ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌’ (ఏఐఐఈఏ)ను దేశ కార్మికోద్యమ చరిత్రలో సమున్నత స్థానానికి తీసుకువెళ్ళిన నాయకుల్లో సరోజ్‌ చౌధురి ముఖ్యులు. 1959 నుండి 1988 వరకు ఆయన ఇన్సురెన్స్‌ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా అనంతరం 1996 వరకు అధ్యక్ష, ఉపాధ్యక్ష బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి వేలాదిమంది ఇన్సూరెన్స్‌ ఉద్యోగులను ఉత్తేజపరిచి ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమంలోకి ఆకర్షించిన మహానాయకులు.
కామ్రేడ్‌ సరోజ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. చరిత్ర, సాహిత్యం, సాంస్కృతిక కళారంగాల వంటి విభిన్న రంగాలలో ఆయనకు ఉన్న విజ్ఞానం అపారం. భిన్న జాతులు, మతాల కలయిక, వివిధ దేశాల సంస్కృతులు, కళలను తనలో ఇముడ్చుకున్న భారతీయ సంస్కృతి ఏదో ఒక మతానికి చెందినది కాదని, అది ప్రజలందరి ఉమ్మడి సొత్తని ఆయన భావన. మానవ సమాజ పరిణామక్రమంలో నూతన శకాన్ని ఆవిష్కరించిన, సామ్రాజ్యవాద దేశాల కబంధహస్తాల నుండి వలస దేశాల విముక్తికి, వర్థమాన దేశాల ప్రగతికి దోహదం చేసిన ‘సోషలిజం’ అజేయం అనేది కామ్రేడ్‌ సరోజ్‌ ధృఢమైన అభిప్రాయం. అసమానతలను, వివక్షత, నిరంతర సంక్షోభాలకు నెలవైనది. రాజ్యాలను రాజ్యాలు, మనిషిని మనిషి దోపిడీ చేసుకునే పెట్టుబడిదారీ విధానమే అంతిమమనే కుహన ఆర్థికవేత్తల వాదనలను పూర్వపక్షం చేస్తూ, 1998లో హైదరాబాద్‌లో జరిగిన ఏఐఐఈఏ 19వ అఖిలభారత మహాసభలో ఆయన చేసిన ప్రసంగం దోపిడీ రహిత సమాజ స్థాపన పట్ల కామ్రేడ్‌ సరోజ్‌కు ఉన్న ధృఢవిశ్వాసానికి, ఆక్షాంక్షలకు ప్రతీక. సమానత్వం, న్యాయం, సన్నిహితతత్వంతో విలసిల్లుతూ ఒక మనిషి, వేరొక మనిషిని దోపిడీ చేయని నూతన సమాజం ఆవిర్భవించాలని కామ్రేడ్‌ సరోజ్‌ ఆకాంక్షించారు.
అతి ప్రమాదకరమైన లుకేమియా వ్యాధితో బాధపడుతూ కూడా జీవితం కంటే సిద్ధాంతం గొప్పదని భావించి కా|| సరోజ్‌ ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ఉద్యమానికి మార్గదర్శకత్వం వహిస్తూనే ఇన్సూరెన్స్‌ వర్కర్‌, పీపుల్స్‌ డెమోక్రసీ పత్రికలకు వ్యాసాలు రాసి చైతన్యపరిచేవారు. బీమారంగ జాతీయీకరణ, 243 ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో వివిధ రకాలుగా ఉన్న జీతాల స్కేళ్ళు, ఇతర సర్వీసు కండీషన్లను అత్యధిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా స్థిరీకరణ, ఇన్సూరెన్స్‌ రంగంలో ఉపాధి కల్పనకు మూలమైన ఆటోమేషన్‌ ఉద్యమానికి నాయకత్వం వహించారు. బీమారంగ జాతీయీకరణ తర్వాత మరలా బీమారంగాన్ని ప్రయివేటీకరించేందుకు పెట్టుబడి దారీవర్గం, ప్రభుత్వం సాగించిన కుట్రలను, ఎత్తుగడలను భగం చేస్తూ ఏఐఐఈఏ నాయకత్వంలో అనేక పోరాటాలను నిర్మించి నాయకత్వం వహించారు. పాలకవర్గాల కుట్రల ఫలితంగా దేశ కార్మికోద్యమంలో వచ్చిన చీలికలకు అనుగుణంగా ఇన్సూరెన్స్‌ ఉద్యమంలో చీలికలు సృష్టించేందుకు జరిగిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక సమరం సాగించారు. బీమా ఉద్యోగుల ఐక్యతా పరిరక్షణ కోసం కృషిచేశారు.
నాటి ఆదిమ సమాజం నుండి నేటి వరకు ‘మానవుని నిరంతర శ్రమ’ ఫలితంగా ప్రపంచంలోని నేటి నాగరిక, సంపద సృష్టించబడ్డాయని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు మానవుని పట్ల విశ్వాసం కోల్పోవడం మహాపాపం అన్న విశ్వకవి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ మాటలను ప్రస్తావిస్తూ, చరిత్ర పట్ల తన అపార విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు. సమాజం సృష్టించిన ఈ సంపద కొద్దిమంది సొంతం చేసుకునేందుకు కోట్లాది మందిని దోపిడీ చేసే పెట్టుబడిదారీ విధానాన్ని సరోజ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవైపు పొలాల్లో, కర్మాగారాల్లో, తోటల్లో శ్రామికుడు శ్రమిస్తూ మానవజాతి వికాసానికి మార్గం వేస్తుంటే, మరోవైపు దోపిడీదారులు మాత్రం ఉత్పత్తి సాధనాలను హస్తగతం చేసుకుని సకల సౌకర్యాలను అనుభవించడం చరిత్రలో ఒక ఘట్టంగా మాత్రమే మిగులుతుందని పేర్కొన్నారు. వేలాది సంవత్సరాలుగా మానవ నాగరికతా రథాన్ని గతుకులతో నిండిన కాలమనే రహదారిపై నడిపించింది శ్రమజీవులేనని మరువరాదని, ప్రగతి మొత్తానికి కారణభూతుడైన శ్రామికుడు అంతిమ విజయం సాధిస్తాడని పేర్కొన్నారు. అసమానతలు, వివక్షత, సెక్స్‌, హింస, నిరాశ, నిస్పృహలను ప్రోత్సహించే ప్రసారసాధనాలు మన సమస్యలకు పరిష్కారం చూపవని, మానవ సమాజం సాధించిన ప్రగతిని మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను నిరంతరం అధ్యయనం చేయాలని కామ్రేడ్‌ సరోజ్‌ యువతరానికి పిలుపునిచ్చారు.
”ఎక్కడ చిన్నారులు తన చిన్ని బొజ్జ నింపుకునేందుకు భిక్షమెత్తరో
పట్టెడన్నం కోసం మహిళలు శరీరాన్ని అమ్ముకునే దుస్థితి రాదో
తండ్రులు తమ పిల్లలను వదిలి వెళ్ళరో, స్త్రీలు, పురుషులు, బాలలు
ఎక్కడ ఆహ్లాదకరంగా జీవిస్తారో, లాభాలకు కాక ‘శ్రమ’కు విలువ
నిచ్చే సమాజాన్ని కోరుకున్న మానవతావాది”
… కామ్రేడ్‌ సరోజ్‌.

దేశ కార్మికోద్యమానికి ముఖ్యంగా ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ఉద్యమానికి తన జీవితాన్నే అంకితం చేసి త్యాగమయ జీవితాన్ని గడిపిన, మానవత్వం నింపుకున్న ఏఐఐఈఏ మహౌన్నత నాయకులు, మహనీయులు కామ్రేడ్‌ సరోజ్‌ 24వ వర్థంతి సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు నివాళులు అర్పించాలి. కామ్రేడ్‌ సరోజ్‌ చూపిన బాటలో పయనిస్తూ, జాతీయ ఇన్సూరెన్స్‌ రంగాన్ని, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడు కుంటామని ప్రతినబూనాలి. దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు ఉద్య మిస్తామనే కర్తవ్యాలకు పునరం కితమవ్వడమే సరోజ్‌ చౌధురికి మనమిచ్చే నిజమైన నివాళి.
జి. కిషోర్‌కుమార్‌
9440905501