రేప‌టి కామ్రేడ్లు..

Tomorrow's comrades..పెద్ద డిగ్రీల చదువులు చదివిన ఇద్దరు స్నేహితుల మధ్య సాగే సంభాషణ ఇది!
”ఏంటి గోపాల్‌, కొత్త చొక్కా లాగ వుందే! ఎప్పుడూ లేదు ఇది నీ ఒంటి మీద! కొన్నావా? ఎంతా? కాస్త చవకేనా? ఎప్పుడూ?”
”ఏడిసినట్టే అడిగావులే! చదివిందంతా ఏ బొందలో పడేస్తావు?”
”ఏంటి గోపాల్‌, మరీనూ? ఏమన్నానిప్పుడు? నీ షర్టు కొత్తది లాగ వుంది, చవకేనా కాస్త – అన్నా, అంతేగా?
పుస్తకాలు చదివితే మాత్రం, నీకు చొక్కా నిన్న చవగ్గా దొరికిందో లేదో తెలుస్తుందా?”
గోపాల్‌ నవ్వాడు.
” తెలవదా? డజన్‌ సార్లు చెపితే, ‘క్షమించు! క్షమించు!’ అంటూ పరిగెత్తుతూ లైబ్రెరీకి పోతే, అక్కడ దొరకలేదని, తిన్నగా పుస్తకాల షాపుకి పోయి, ‘కాపిటల్‌’ కొనేసి, బస్సులోనే చదవడం ప్రారంభించానన్నావు! మరి, ఎంత నేర్చుకున్నావు? ‘సరుకుకి ధర, చవగ్గా వున్నా, ప్రియంగా వున్నా, దాని విలువ అదేలే’ అని అర్ధం కాలేదా?”
”అయ్యబాబోరు! ఆ పుస్తకం ఎన్ని పేజీలదో! నాలుగో ఐదో వందలు దాటి పోయి వుంటుంది! నేను మొదలు పెట్టింది ఎప్పుడు? వారం దాటలేదు! అవన్నీ ఎక్కడ కనపడ్డాయి? నిజం చెప్పు! అలాంటివి కూడా వున్నాయా ఆ పుస్తకంలో? ఉంటే నేనింకా చదవలేదుగా? అయినా, మొదట్లోనే ఒక మాట దొరికింది అందులో! ‘డబ్బు’ని, ‘జనరల్‌ ఈక్వివలెంట్‌’ అన్నాడు, ఆ మార్క్సు. మొదట్లో అర్ధం కాలేదు గానీ, నిజంగా, అంతేగా మరి? సొసైటీలో, ఏ వస్తువుని అమ్మాలన్నా, కొనాలన్నా, అది ‘డబ్బు’తో మారవలిసిందేగా? ఒక వస్తువుని ఇచ్చి, ఇంకో వస్తువుని తీసుకునే పద్ధతి ఎప్పుడో పోయిందట! మా అమ్మమ్మ తెగ ఆశ్చర్యపోతుంది ఇప్పటికీ! తన చిన్నప్పుడు, కరివేపాకు ఇస్తే, వంకాయలు ఇచ్చే వారంట! కాసిన్ని పాలు పోస్తే, బుట్టెడు గోంగూర ఇచ్చే వారంట! సోలెడు బియ్యం ఇస్తే, బుట్టెడు ముంజెలు అప్పజెప్పేసేవారంట! ఇప్పుడా…”
”ఇప్పుడా!?” – అని ఆశ్చర్యపోతుందా మీ అమ్మమ్మ? అయితే, అమ్మమ్మకి కూడా నువ్వు చదివే ‘కాపిటల్‌’నే చదువుతూ వినిపించు! ఒక వస్తువుని ఇచ్చి, ఇంకో వస్తువుని తీసుకుంటే, మారకం అయినట్టే, వస్తువుకీ, డబ్బుకీ జరిగే మారకం అయినా అలాంటిదేగా? అదీ మరుపై పోయిందా? డబ్బు వెనకాల వుండేది ఏమిటి, అది కూడా ఒక వస్తువే అని…”
”ఆఁ, ఆఁ, గుర్తొచ్చింది గోపాల్‌! గుర్తొస్తోంది! డబ్బు వెనకాల వుండే ‘బంగారం’ కూడా ఒక వస్తువే! అది, మనుషులు చేసే వస్తువేగా? అవును, వంకాయలిచ్చి బీరకాయలు తీసుకుంటే, వాటిని పండించే వాళ్ళ శ్రమలు సమానంగా వున్నట్టు, వస్తువుకీ – డబ్బుకీ మారకాలు జరిగితే కూడా అంతే కదా? వంకాయలిస్తే బీరకాయలు రాకపోవచ్చు, దోసకాయలూ రాకపోవచ్చు. ‘డబ్బు’తో అయితే, ఆ సమస్య ఉండదులే. వంకాయల రైతు, అవి అమ్మేసి డబ్బుని తీసుకుంటే, దానితో బీరకాయలో, దోసకాయలో కొనెయ్యవచ్చు! డబ్బుతో దేన్నయినా కొనొచ్చు! డబ్బుతో జరిగేది కూడా మారకమే! మర్చిపోలేదు గానీ, ఎందుకో చప్పున గుర్తు రాలేదు! అది కాదు, మొన్న ఏదో నిన్ను బాగా అడగాలనుకున్నాను. ఒక్క మాట చెప్పెయ్యి! పరిశ్రమల వాళ్ళు, సరుకుల్ని తయారు చేయించి వాటికి ధరలు పెట్టేటప్పుడు, సాధనాల ఖర్చులూ, జీతాలూ, అన్నీ కలుపుతారు – అన్నావు గానీ, ‘లాభం’ అని ఇంకో మాట కూడా కలుపుతారన్నావు! అప్పుడే నాకు నచ్చలేదనుకో! అయినా, గోపాల్‌ బాగా చదువుతాడులే, మళ్ళీ అడిగితే తెలుస్తుందిలే – అనుకున్నాను నిజంగా. ఇప్పుడు నువ్వు కాస్సేపు కూర్చుంటావా? పోనీ నేను సాయంత్రం రానా?”
”అబ్బా! ఎంత సేపు మాట్లాడావు? అసలేంటి నీకు నచ్చనిది? ఏదీ, మళ్ళీ చెప్పు!” అంటూ గోపాల్‌ స్నేహితుణ్ణి ఇష్టంగా చూస్తూ అన్నాడు.
”చెప్పేశానుగా అంతా! అదే మళ్ళీ చెపుతా, వినూ! అది కాదు, పరిశ్రమల వాళ్ళు, అదే, కంపెనీల వాళ్ళు – అన్నావులే, వాళ్ళు, తయారు చేయించే సరుకులికి ‘ధరల్ని’ పెట్టేటప్పుడు, మొదట ఉత్పత్తి సాధనాల్ని కొన్న ఖర్చునీ, వాటిని వాడేస్తూ కొత్త శ్రమలు చేసే వాళ్ళకిచ్చే జీతాల ఖర్చునీ, ఈ రెండు ఖర్చులతో పాటు, ఇంకొక్క పైసా అయినా ఖర్చు అవని దాన్ని, ‘లాభం’ అనే పేరుతో కూడా రావాలని’ దాన్ని కూడా ధరలో కలిపేస్తారన్నావు. అదే మరి కొంచెం చెప్పు!”
”అర్ధం కావటం లేదా? అన్నీ కలిపే ధర అయినట్టు! ఇక, తర్వాత సరుకు అమ్మకం!”
”అమ్మో! అలాంటి ధర తోనే అమ్మకం అవుతుందా? అంత ధరతో ఎవరు కొంటారోరు? కొనే వాళ్ళేమన్నా పిచ్చి వాళ్ళా?”
”కొనే వాళ్ళు పిచ్చి వాళ్ళు కారు గానీ, అమ్మే వాళ్ళు మాత్రం చాలా గడుసు వాళ్ళులే! నువ్వు ఇంకా, ఆ పుస్తకాన్ని చేతుల్తో ముట్టుకున్న తర్వాత కూడా లాభం మాటతో నువ్వింకా వెర్రి మొహం తోనే వున్నావులే రవీ!”
”నాకేం వెర్రి మొహం లేదోరు! నన్ను లెక్చెరర్లందరూ మెచ్చుకుంటారు. నిన్ను మెచ్చుకున్నారా చెప్పు ఎప్పుడన్నా? నేనేదో వందల వందల పేజీల పుస్తకాన్ని, కొన్న వారం రోజుల్లో పూర్తి చెయ్యలేదని, నన్ను తిడతావు? న్యాయమేనా నీకు?”
”నిన్ను తిట్టానా? అది తిట్టా! విమర్శించాను! అది అవసరం! సరే, చెప్పు! ఏంటీ నీ ప్రశ్న? అదా? ‘లాభం’తో కూడా ధరతో వున్న సరుకుని ఎవరన్నా కొంటారా – అన్నావు. నిన్న నేను కొనలేదా? కొన్నాను కదా, లాభం గురించి చదివిన వాణ్ణే! ఈ చొక్కాని 400 ధరతో కొన్నా! ఇందులో లాభం ఎంత వుంటుందో ఊహిస్తే, కనీసం 100 రూపాయలైనా ఉంటుంది. దాని కోసం ఒక్క పైసా అయినా ఖర్చవకుండా! ఇదంతా తెలిసే! కొనక ఏం చేస్తావు? తెలిసినా కొనాలి, తెలియక పోయినా కొనాలి! ‘లాభం’ అంటే, పెద్ద దొంగతనం అవడం కన్నా ఇంకేం వుంటుంది?”
”ధరలో లాభం, అంత ఉంటుందో, ఎంత ఉంటుందో, ఎలా చెప్పగలం? మనం ఊహిస్తే సరిపోతుందా? ఎక్కౌంటు చూశావా? అది అక్కర లేదా?”
”ఎక్కౌంట్లు ఎందుకు? అందులో ఏమన్నా రాసి వుంటుందా చదవడానికి?”
”రాసి వుండాలా? అదేం మాట? సాధనాల ఖర్చూ, జీతాల ఖర్చూ, ఆ రెండూ వుంటే చాలు! ‘ధర’లో నించి ఆ రెండూ తీసేస్తే, మిగతాది లాభమే అవదా? అలా తెలియదా?”
”అబ్బా! మంచి ఎక్కౌంట్ల వాడివే! మార్కు లొస్తున్నాయా?”
”ఆఁ, ఫస్టు మార్కుల వాళ్ళల్లో ఒకణ్ణి నేను కూడా! నువ్వు నమ్మవు నన్ను!”
”నిన్ను మార్కుల్లో ఫస్టు క్లాసు వాడిగా నువ్వు చెప్పకుండానే నమ్ముతాను. కానీ, స్టూడెంట్స్‌గా మనం నేర్చుకోవలిసింది, మార్కులే, టీచర్ల పొగడ్తలే కాదు రవీ!”
”ఆఁ, ఇంకా చెప్పకు! తెలుసులే. స్టూడెంట్‌గా ఆ పుస్తకాన్ని కంఠతా పట్టమంటావు! సరే, పడతానులే బాబూ!”
”స్టూడెంట్లే కాదు, శ్రామిక వర్గం వాళ్ళందరూ ఆ పుస్తకాన్ని కంఠతా పట్టాలి!”
”కంఠతా పట్టాక ఏం చేస్తాం?”
”అది అడగక్కర లేదు, ఏం చెయ్యాలో ఎవరో ఒకరు చెప్పక్కర లేదు, చదివితే నీకే తెలుస్తుంది!”
”ఓరి నాయనో! చదివేస్తే చాలదా? తర్వాత చేసే పని కూడా వుందా! ఇదేం పుస్తకం రా బాబూ? అందులో ఏమన్నా భూతం వుందంటావా?”
”తప్పకుండా వుంది! ‘లాభం’ అనే భూతం! దాన్ని హతమార్చడమే జరగాలి!”
”అమ్మో! అదో పనా? ఎవరు చేస్తారు?”
”ఇంకెవరు? మనం కూడా! నువ్వు కూడా! నేను కూడా!”
”ఇదేమిటి? మనం ఉద్యోగాల్లో వుంటాం కదా?”
”ఇప్పుడు ఉద్యోగా లెవడిస్తున్నాడు? ఉద్యోగం దొరికి జీతం కూడా దొరికితే, ‘అమ్మయ్య’ అని సంతోషిస్తాం. కానీ, మనం చేసేది ‘జీతం’ కోసమే కాదు, ‘లాభం’ కోసం కూడా చెయ్యాలి. పని దినం పది గంటలైతే, జీతం కోసం 5, 6 గంటలూ, మిగతా పని లాభం కోసమే! అలా తెలిసినా, అలాగే చెయ్యాలి!”
”అలా ఉంటుందా? అయితే చెయ్యం!”
”అయితే, ఆ గంటలోనే పోతావు! ఇక, ఉద్యోగం వేపు రానే రాలేవు! నిరుద్యోగమే! ఉద్యోగం కన్నా పెద్ద ఉద్యోగం అన్నారు నిరుద్యోగాన్ని ఆ మధ్య ఎవరో గానీ!”
”ఇదేమిటి! నువ్వేదో సరదాగా మాట్లాడుతావు అనుకుంటే, ఇదేమిటి? ఒక్కటి చెప్పు! పరిశ్రమ, సరుకుల ధరల్లోకి లాభాన్ని చేర్చకుండా, ధరని నిర్ణయించరా అసలు? ధర ఎప్పుడూ అలా వుండదా అసలు?”
”ధర అలా వుంటే, ఒకే ఒక్క ధర అయినా అలా వుంటే, అది, పెట్టుబడిదారీ ఉతత్తి విధానమేనా! అలా ఉంటుందా ధర? అలా ఉండదు! అసలు, ‘పెట్టుబడి’ అనే మాట గురించి ఎంత గొప్పగా అంటారో తెలుసుగా? డబ్బు ఖర్చు గురించి కాదు, ‘పెట్టుబడి’ అనే దాని గురించే ఆ గొప్ప! డబ్బు, అనేది, తనతో పాటు ఎక్కువ డబ్బుని తెచ్చే కార్యకలాపంలో వుంటే, అప్పుడే అది ‘పెట్టుబడి’! దాని యజమాని పెట్టుబడిదారుడు! అతన్ని ‘బూర్జువా’ అని కూడా అంటారు! ఇంగ్లీషులో తెలుసుగా, కేపిటలిస్టు! గుప్పెడు పైసలు, చారెడు రూపాయిల్ని తీసుకు రావాలి! అదీ పెట్టుబడి కార్యం!”
”ఎలాగ తీసుకు రావటం? ఏదన్నా మహిమ వుంటుందా డబ్బుని పెంచేది?”
”లాభం, మహిమే కదా?”
(ఇంకా ఉంది)
– రంగ‌నాయ‌క‌మ్మ‌