రేప‌టి కామ్రేడ్లు

రేప‌టి కామ్రేడ్లు”’అంతేగా’ అనకు! అదేం చిట్టి పొట్టి తేలిక పనా? ‘ప్రాణాలు పోతే పోతాయి’ అనుకోవాల్సిన పని!”
”అయితే, ఎలా జరగాలి అదంతా? శ్రమ దోపిడీకి గురి అయ్యే ప్రజలంతా, కనీసం ఆ సమస్యని గ్రహించగలిగే దోపిడీదారులు కూడా మారాలి! అదే అనిపిస్తోంది!”
”మారడం రేపు కాదు! జరిగిపోతోంది చరిత్రలో! మారుతున్నారు! మారిపోతున్నారు! మొదట మార్క్సు, అలా మారిన వాడే! తండ్రి లాయరైనా, గొప్ప ధనికుడు కాడు. ఇతడు దేవుళ్ళ మూఢ నమ్మకాలు లేకుండా తన డిగ్రీల కాలంలోనే నేర్చుకుని, క్రమంగా సమాజంలో మార్పులవైపు తల తిప్పాడు! అతని కంటే రెండేళ్ళు చిన్న వాడు ఎంగెల్స్‌, పెద్ద పెట్టుబడిదారుడి కొడుకు, అయితే యేం, విషయాలు తెలిసి మార్క్సుకి తోడయ్యాడు! ధనవంతుల పిల్లలు కూడా కమ్యూనిస్టులవుతారు అనడానికి అదే ఉదాహరణ!”
”చాలు! ఆ ఉదాహరణ చాలు! కానీ, దోపిడీదారుల వర్గం మారుతుందని భావించ గలమా గోపాల్‌?”
”ఆ వర్గంలో కూడా కొందరు వ్యక్తులు తెలుసుకొని మారతారు. ఆ వర్గం అంతా మారడం మాత్రం, శ్రామిక వర్గం చేతిలో వుంటుంది!”
”అంటే, మన చేతుల్లో! మన పెద్దవాళ్ళూ శ్రామికులే! నువ్వూ నేనూ అంతే! ఇక మారవలి సింది, స్టూడెంట్స్‌ గాక, ఇంకెవరు? చెప్పు! మనం ఏం చెయ్యాలి? ఎవర్ని కలవాలి? ఎటు పోవాలి?”
”ఎక్కడికి పోతాం? మనకి తెలిసింది ఎంత? పుస్తకాల్లో చదివిందే చాలా? మనమే ఇలా నాలుగైదు మాటలు మాత్రమే చెప్పుకునే వాళ్ళంగా వుంటే, నిరుపేద శ్రామిక జనం ఎలా వున్నారో, మనకి నిజంగా ఏం తెలుసు? చెత్త చెత్త సినిమా లన్నీ చూడడం తప్ప, వాళ్ళేం చేస్తున్నారు? మనం ఒక పని మొదలు పెట్టాలి రవీ! అలా నాకు అనిపి స్తోంది! పది మంది స్టూడెంట్స్‌ని కూర్చో బెట్టుకుని, వారానికో, పది రోజులకో, ఏవో నాలుగు మాటలు, ఇలాంటివే పెట్టుకుంటే, కొన్నాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు రోత సినిమాలకే పోతారో, మన మీటింగులకే వస్తారో!”
”దానికేమన్నా ఖర్చవుతుందా గోపాల్‌ ? ఎంతయినా నేను తెస్తా! ఇబ్బంది అవదు. మా వాళ్ళు డాక్టర్లు! బాగానే వుంటుంది డబ్బు.”
”వాళ్ళకి వుంటుందేమో! నీకూ వుంటుందా?”
”ఆ డబ్బు నాదేగా?”
”అందుకా, లాభం గురించి అంత ఆరాటపడ్డావు?”
”అది ఆరాటం కాదు గోపీ! సరే, మన సంగతి. ఆ స్టూడెంట్సుకి మధ్యాహ్నం పూట అన్నాలు పెడితేనే, వాళ్ళు ఆకళ్ళు లేకుండా తినేసి, ఉత్సాహంగా కబుర్లకి కూర్చుంటారు రాత్రి దాకా.”
”కబుర్లు కూడా వుంటాయి గానీ, అసలు సంగతి ‘కాపిటల్‌’ని చదివి, వినిపిస్తూ, వివరంగా చెప్పడం! ఆఁ, అదే మొదలు!”
”భలే చెప్పావు గోపాల్‌ ! కానీ, ఇంకా నాలుగు ‘కాపిటల్‌’ పుస్తకాలు వుంటే, కలవడంలో శ్రద్ధగా వున్నవాళ్ళకి చదవమని ఇవ్వొచ్చు! పని ఎంతో తేలిగ్గా జరుగుతుంది. అవి నేనే తెచ్చెయ్యనా సాయంత్రం?”
”రవీ ! మధ్యాహ్నం నీకు క్లాసు వుందా?”
”ఉంది గానీ, వెళ్ళద్దనుకున్నాను ఇందాక. వెళ్ళక పోతే ఎలాగ? క్లాసులో వాళ్ళ తోటే కొంచెం మాట్లాడి, ‘ఒక సారి మా ఇంటికి రండి, భోజనాలు అక్కడే, కాస్త మాట్లాడుకుందాం’ అనాలని! నన్ను ‘కాపిటల్‌’ని అడిగాడే, వాడు మళ్ళీ అడుగుతాడో లేదో చూస్తా! మార్కుల్లో తెలివైన వాడే! చూస్తా, వెళ్దామా? అయ్యో, గంటన్నర దాటింది! మనం ఇంకా ఇక్కడే, నువ్వు బూర్జువా పీహెచ్‌డీ పనిలో! నేను ఇంకో బూర్జువా డిగ్రీ కోసం ఎదురు చూస్తూ! రోజులన్నీ ఇలాగే జీవితాలు జరుగుతూ పోతే?”
”ఇంకా ఇలాగే ఎందుకు జరుగుతాయి? మీ వాళ్ళని పిలుస్తావుగా? నేనూ వస్తా! కానీ, మొదటి రోజునే కాదు, వాళ్ళు ఫ్రీగా వుండరేమో! వాళ్ళు వచ్చిన నాడే కబుర్లు మొదలెట్టు! డబ్బుని మార్క్సు ‘జనరల్‌ ఈక్వివలెంట్‌’ అన్నాడు కదా? ఆ మాట చెప్పు! ‘డబ్బు’ అంటే, ప్రపంచంలో వున్న సమస్త వస్తువులతోటీ మారేది కదా? అందుకే అది జనరల్‌గా మారకాల సాధనం! అది చెప్పు! ఆసక్తిగా వింటారు కదా? డబ్బుకీ వస్తువుకీ వుండే రకాల్లో వుండే విలువల సంగతి కూడా చెప్పి వాళ్ళనే కొన్ని ప్రశ్నలు అడగొచ్చు!”
”నిజమే. దాని తోనే మొదలెట్టాలి గానీ, నేను నీ లాగా చెప్పగలనా చెప్పు? నువ్వే అయితే, ఎంత బాగుంటుంది! నువ్వు కూడా వస్తావు కదా? నువ్వే చెప్పు ప్రధానంగా!”
”నేను రెండోసారి నించీ వస్తాలే! నువ్వు మారకాల మాటతో మొదలెట్టు! ఏ వస్తువు అయినా, వంకాయలే అనుకో! ఒక రైతు, షాపుకి పోయి, తను తెచ్చిన వంకాయలు ఇస్తే, వాటితో బీరకాయలు తీసుకోగలడా? పోనీ, బియ్యమో, కొంచెం పప్పో తీసుకోగలడా? ఏ వస్తువు తోటీ అది జరగదు, డబ్బుతో తప్ప! డబ్బు కూడా ఒక వస్తువేగా? అది, బంగారం కదా? బంగారపు చిన్న చిన్న ముక్కలైనా, బంగారం, నోట్లుగా కాయితం ముక్కలైనా, అది, ఒక వస్తువే! ప్రపంచంలో ఎక్కడ్కెనా, డబ్బు ఇచ్చి, దేన్ని అయినా తీసుకోవచ్చు! ఒక షాపులో, కూరగాయలు చాలా వున్నాయి, కాకరకాయల్తో సహా! ఆ షాపుకి పోయిన ఒక రైతు చేతిలో వంకాయలున్నాయి. అక్కడ కాకరకాయల్ని చూడ గానే, అవి కావాలనిపిం చింది. చేతిలో ‘డబ్బు’ లేదు! అయినా, ‘వంకాయలిస్తా, కాకరకాయ లివ్వండి’ అంటే, వాళ్ళు ఇవ్వరు. అయినా, వంకాయల్ని ఇచ్చి, డబ్బుని తీసుకుంటే, అంటే, వంకాయల్ని అమ్మి, డబ్బుని తీసుకుంటే, అంటే వంకాయలకి డబ్బు తో మారకం జరిగితే, డబ్బు వస్తుంది కదా? ఆ డబ్బుని ఇచ్చి, కాకరకాయల్ని కొంటే, అంటే, కాకరకాయలకి డబ్బుతో మారకం జరిగితే కాకరకాయలు వస్తాయి. ఈ మనిషికేం జరి గింది? చేతిలో వస్తువు వున్నా, ఆ వస్తువునే వాడేస్తే సరే! ఇంకో వస్తువేదో కావాలంటే, ఈ వస్తువుని అమ్మి, డబ్బుని తీసుకోవాలి. ఆ డబ్బుతో ఏ వస్తువు కావాలో ఆ వస్తువుని కొనాలి! ఆ డబ్బుతో, కాకరకాయలకి మారకం జరగాలి! ఈ మారకాల కోసం డబ్బుతో ఎంత ఖచ్చితమైన ఏర్పాటు అంటే… రవీ! అలా మొదలెట్టి, వాళ్ళని బోలెడు ప్రశ్నలు అడగొచ్చు! వాళ్ళు కూడా ఎన్నో అడుగుతారు. క్రమంగా అది, అమ్మడాలూ, కొనడాలూ వస్తువుల మారకాలూ – అన్నీ దాటి దోపిడీ దగ్గిరికి రావాలి! అదంతా ఒక్క వారం లోనే జరగదులే.”
”చాలా సంతోషంగా వుంది నాకు. చిన్నప్పట్ని ంచీ, వడ్డీలూ, లాభాలూ, అని చదువుతూనే వున్నాం! 100 డబ్బుకి ఇంత వడ్డీ రావాలంటే, వెయ్యికి ఎంత? – అని లెక్కలు! అవే నేర్పుతున్నారు!”
”అదే మరి, దోపిడీని నేర్పే చదువు! దాని మీదే పరీక్షలు! అలా రాస్తేనే పాసవడాలు! ఆ లెక్కలు నేర్పే ఉద్యోగాలు!”
”ఎంత ఘోరం! నిజంగా టీచర్లకి అదంతా తెలీదు కదా?”
”క్లాసులో స్టూడెంట్స్‌కి చెప్పే పాఠాల్లో చాలా తప్పులే! అలాగే రాయకపోతే, ఫెయిలవుతారు, ఉద్యోగాలు దొరక్క బికార్లవుతారు!”
”అయ్యయ్యో! ఇవేం చదువులు! ఈ ఉద్యోగాలెందుకు? అడుక్కుని తింటే మంచిది!”
”ఎవరు పెడతారు అడుక్కో వాలంటే? ఎంత పెడతారు? పెట్టేది, మనం వొదిలేసే ఉద్యోగాలు చేసే వాళ్ళేగా? లేకపోతే, దోపిడీదారుల్నే అడుక్కోవాలి!”
”వొద్దు! ఇంకా వొద్దులే! మా వాళ్లని ఎంత సరిగా పిల్చానో సాయంత్రం చెపుతా! మీ క్లాసులో కూడా చెప్పు గోపాల్‌! ఈ శని, ఆదివారాల నించే చేద్దాం. చాలా సంతోషంగా వుంది నాకు. మా వాళ్ళతో మాట్లాడాక, నీకు తర్వాత చెపుతా!”
”నువ్వే దానకర్ణుడి లాగ చేద్దామని అనుకోకు! నాకూ స్కాలర్‌షిప్‌ వుంది! ఖర్చు విషయం అంతా చెప్పు నాకు… ఇక లేద్దాం. గంట దాటింది మనం కబుర్లు మొదలెట్టి! ఇక మనం రెగ్యులర్‌గా మాట్లాడుకోవాలి. మీ క్లాసు వాళ్ళు ఏమన్నారో మర్చి పోకుండా రాస్తే, రాసి వుంచు! వెళ్దామా మరి? వెళ్దాం కామ్రేడ్‌!”
”కామ్రేడూ, బూర్జువా, ఈ మాటలు నాకు కొత్త! అర్ధం కావు!”
”అవుతాయి, కొన్నాళ్ళకి, మన మీటింగుల్లో వాళ్ళందరికీ అర్ధం అవుతాయి! రవీ! మనం ఈ మాత్రంగా మొదట్లో ఆలోచించామా? ఏదో చిన్న పని అయినా చెయ్యాలని ఆలోచన వచ్చింది గానీ, అదేమిటో ఈ ఆలోచన రాలేదు. ‘కాపిటల్‌’ అంటే ‘పెట్టుబడి’ కదా? పెట్టుబడిదారీ విధానంతో దోపిడీలతో ఈ నాటికీ సమాజం నడుస్తోందని చెప్పాలనే మార్క్సు ఏనాడో అన్ని విషయాలు రాస్తే, మనం ఏదన్నా చిన్న పని అయినా చెయ్యొద్దా? స్టూడెంట్సులో కొందరైనా ఆ పుస్తకం చూస్తే చాలు. కొందరైనా ఆ పుస్తకం చదివి, అందులో వున్నదేంటో తెలుసుకుంటే, ఆ మార్పే జరిగితే, అది అలాగే వుంటుందా చెప్పు? మనం తప్పకుండా ఇలాగో, ఎలాగో, ఇది చెయ్యాలి రవీ!”
”ఇలాగో, ఎలాగో కాదు. ఎంగెల్స్‌ చేసినట్టే చేద్దాం. ఎంగెల్స్‌ లాగే మార్క్సుకి తోడుగా అయిపోవాలని నాకు నిజంగా వుంది ఇప్పుడు! చెయ్యాలి గోపాల్‌! నువ్వు ఆ పుస్తకం బాగా చదివావు! మనం ఎలాగో చెయ్యడం కాదు! అదే మన పని ఇప్పుడు! నేను వెళ్తా! మా వాళ్ళతో మాట్లాడాలి! ఎంత మంది ఉన్నారో!”
(ముగిసింది)
– రంగ‌నాయ‌క‌మ్మ‌