ఆధునికకాలంలో యాత్రలు, ప్రయాణాల భౌతిక స్వరూపాలే కాదు వాటి మానసిక స్వరూపాలు కూడా మారిపోయాయి. భక్తి కోసమో, ముక్తి కోసమో, తీర్థమనో, క్షేత్రమనో కాకుండా కొండకోనలు, అడవులు, తీరాల చుట్టూ తిరిగే ‘యుక్త రుధిరాలు’ ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. వీటిలో కూడా ‘ప్రాచుర్యం పొందినవి’, ‘పదిమంది సజెస్ట్ చేసినవి’ మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న హిడెన్ లొకేషన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే ఉత్సుకత ఊపందుకుంది. ఆ కోవలో అడివిబాట పట్టి కొండకోనల రహస్యాలను, అందాలను ఆస్వాదిస్తూ బయట ప్రపంచానికి తెలియజేస్తున్న ఫారెస్ట్ ట్రావెలర్ వివేక్ లంకమల ఇటీవల తన ప్రయాణాలకి ‘లంకమల దారుల్లో’ అనే అక్షర రూపం ఇచ్చారు.
ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కోవిడ్ కాలంలో అడవికి వెళ్లడం ఆటవిడుపుగా మొదలై అలవాటుగా మారి 40 మంది మిత్రులతో గుంపుగా ‘నో ప్లాస్టిక్ లంకమల’ అనే ఉద్యమంగా నడిపేదాకా లంకమల తీర్చిదిద్దింది. కలివికోడి జాడలు… పగటి చీకటి కోనలోని పడిన ప్రయాసలు… సవాళ్ళబాయి నీటితేటలు… ముంపుపల్లెలు మోసే కన్నీటి ఇసుకమేటలు… గండికోట రాజ్యపు మొండిగోడల ఆనవాళ్లు… సగిలేరు మొదలు కడలేరుదాకా. మల్లెంకొండ నుంచి వెలిగొండదాకా, రాయల చెరువు నుంచి పెన్నా సంగమందాకా… మొత్తం 21 ప్రయాణ కథనాల సంగమం ఈ ‘లంకమల దారుల్లో’
‘అడుగు బయటపెడితే గమ్యమే చేరాలని లేదు. ఈ ప్రయాణంలో ఎక్కడో ఒకచోట నువ్వు నీకు ఎదురవ్వకపోవు’ (వాడ్రేవు చినవీరభద్రుడు), ‘ఈ కథనాల్లో మనం మాట్లాడే మాటలే ఉంటాయి. వీలైతే మరింత వెనక్కి వెళ్లి మనం మర్చిపోయిన మాండలికాలన్ని గుర్తుజేస్తాయి’ (సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి), ‘వొక సాదా సీదా పల్లెటూరి పిల్లగాడు అడవి అంతు చూడాలనే తాపత్రయంతో వేసిన అడుగులే ఇవి’ (భూమన్), ‘మనిషి తన జీవితకాలంలో నదిని ఒకసారి మాత్రమే దాటగలడు కారణం నీటికున్న చలనత్వం. దారి కూడా అంతే’ (శివ రాచర్ల) వంటి ముందుమాటలు ఆకర్షణీయంగా పాఠకున్ని పుస్తక తలుపులు తెరిచేలా చేస్తే, రచయిత ఆస్వాదిత అభివ్యక్తితో ‘మధ్యలో వెనక్కి తిరిగి పోదాం’ అనే ‘తలపు’ను రాకుండా చేస్తాడు. మనిషిని విశాలతకు గురిచేసే ఏ పుస్తకాన్ని వదలకూడదు. అందులోనూ స్థానికతతో కూడినవైతే అస్సలు…
– మ.మో.రె. 9989894308