– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ శ్రీ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి, జులై 24 తర్వాత ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్‌కు రూ.2లక్షలు, హెల్పర్స్‌కు రూ.1లక్ష చెల్లించాలని వీఆర్‌ఎస్ సౌకర్యం కల్పించాలని అన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ప్రభుత్వం, మంత్రుల దృష్టికి తీసువచ్చామని అన్నారు. పై అంశాలను పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమన్నారు. పైగా రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ మనోభావాలకు వ్యతిరేకంగా, ఏకపక్షంగా అతి తక్కువ డబ్బులు చెల్లించి, అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్‌ను జులై 4 తర్వాత ఇంటికి పంపించాలనే నిర్ణయం దుర్మార్గమైన చర్య అన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు తీవ్రమైన నష్టం కలిగించే, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు కే.సునీత, జిల్లా అధ్యక్షురాలు డి.వెంకటమ్మ, నాయకులు డి.సునీత, పి.రత్నమాల, జె.సుభద్ర, విజయ, పద్మ, పంచశీల, అనసూయ, లక్ష్మి, అనిత, కమల, పార్వతి, సీఐటీయూ నాయకులు దర్శనాల నగేష్ అంగన్‌వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు.