సాగునీటి కోసం రైతుల ఆందోళన

Concern of farmers for irrigation water– కాలువలకు నీరిచ్చి పంటలను కాపాడాలని డిమాండ్‌
– అధికారుల హామీ
నవతెలంగాణ-మంథని/గంగాధర
సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని.. కాలువలకు నీరు విడుదల చేసి ఆదుకోవాలంటూ రైతులు మంగళవారం మంథని, గంగాధర మండలాల్లో ఆందోళన చేశారు. కొద్ది రోజుల్లో చేతికొచ్చే సమయంలో పొలాలు వాడుబడుతున్నాయని, పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం మట్టిపాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే నీరు విడుదల చేయాలని కోరారు. ఉన్నతాధికారులకు చెప్పి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివరాలిలా ఉన్నాయి..
ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పోచమ్మవాడ, మల్లెపల్లి గ్రామాల రైతులు మంథని గోదావరిఖని-ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే.. వరి పొట్ట దశకు వచ్చిన సమయంలో నీటి కష్టాలు మొదలయ్యాయని.. కాలువల ద్వారా సాగునీరు అందించకుంటే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సాగునీరు విడుదల చేస్తామంటేనే తాము పంటలు సాగు చేశామన్నారు. కానీ ఇప్పుడు సాగునీరు ఇవ్వడం లేదన్నారు. వెంటనే అధికారులు, ప్రభుత్వం స్పందించి సాగునీరు అందించి పంట పొలాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను సంబంధిత అధికారులకు వివరిస్తామని, రైతులకు నీళ్లు అందేలా చూస్తామని మంథని సీఐ హామీ ఇచ్చినప్పటికీ రైతులు ఆందోళన విరమించలేదు. ఈఈ బలరాం సంఘటన స్థలానికి చేరుకొని సంబంధిత పైఅధికారులతో మాట్లాడి సాగునీరు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు.
కరీంనగర్‌ జిల్లా గంగాధర
వరద కాల్వకు నీరు విడుదల చేయాలంటూ కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల-కొండన్నపల్లి వరద కాల్వ బ్రిడ్జిపై రైతులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వంతోపాటు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తక్షణమే స్పందించి వరద కాలువకు నీరు విడుదల చేయించాలని డిమాండ్‌ చేశారు. నీరివ్వకుంటే పంటలు ఎండిపోతాయని, తాము పడిన శ్రమ, పెట్టుబడులు కోల్పోవల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.