– జహంగీర్‌ను గెలిపించండి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి
నవతెలంగాణ-తుంగతుర్తి
ఉద్యమాలే ఊపిరిగా, ప్రజాశ్రేయస్సే తన ధ్యేయంగా, నిరంతరం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండీ జహంగీర్ గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఆ పార్టీ అభ్యర్థి ఎండీ జహంగీర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. తుంగతుర్తి గడ్డ కమ్యూనిస్టుల అడ్డా అని, ఈ ప్రాంతంలో భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులకే ఓటు అడిగే నైతికహక్కు ఉందన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ఆశయ సాధన కోసం సీపీఐ(ఎం) పనిచేస్తుందన్నారు. బూర్జువా పార్టీలు మతం, కులం, ప్రాంతం అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఉపాధి పరిశ్రమలు, మౌలిక రంగాల్లో అత్యంత వెనుకబడ్డ పార్లమెంట్ నియోజకవర్గం భువనగిరి అని అన్నారు. బీబీనగర్ మండలంలోని ఎయిమ్స్ వైద్యశాలలో 48 విభాగాలు ఉండగా 24 విభాగాలు మాత్రమే పనిచేస్తున్నాయని, ఇది బీజేపీ చేతగానితనం కాదా అని ప్రశ్నించారు. గిరిజనసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మానాయక్ మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శి వర్గసభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు మాట్లాడుతూ.. సీపీఐ(ఎం)ను గెలిపిస్తే ప్రజల హక్కులతో పాటు వారి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్, సీనియర్ నాయకులు తాటి విజయమ్మ, రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లా సుదర్శన్, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.