
నవతెలంగాణ – మీర్ పేట్
మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు, ఆందోళనలు చేస్తున్నారని మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, మున్సిపాలిటీలో కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సంక్షేమం గురించి పనిచేస్తున్నటువంటి నాయకురాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అలాంటి మంత్రిపై అసత్య ఆరోపణలు తగదని హితవుపలికారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కోసం తెచ్చిన నిధుల వివరాలు జీవోలతో సహా పంపించమని దానికి ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా మంత్రిపై అసత్య ఆరోపణలు చేయడం మాని చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.