– నేడు జిల్లా వ్యాప్తంగా ప్రవేట్ ఆసుపత్రుల వైద్య సేవల నిలుపు కు పిలుపు
నవతెలంగాణ – కంఠేశ్వర్
పశ్చిమబెంగాల్ లోని కోల్కతాలో విధుల్లో ఉన్న పీజీ మెడికల్ విద్యార్థిని పై లైంగిక దాడి చేసి, హత్యకు పాల్పడిన ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలో భాగంగా ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వేస్టేషన్, తిలక్గార్డెన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ.. అత్యాచార ఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని దోషులుగా నిర్ధారించబడిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నేడు అనగా శనివారం జిల్లావ్యాప్తంగా ప్రవేట్ ఆసుపత్రుల బంద్ పాటిస్తూ వైద్య సేవలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే బెంగాల్లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ శనివారం దేశవ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేయాలని ఐఎంఏ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలోనూ వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు, ఆర్మూర్లో కూడా ఆస్పత్రుల బంద్ పాటించనున్నట్లు ఐఎంఏ ప్రతినిధులు తెలిపారు. ఈ బంద్ కు ప్రజలు సహకరించాలని కోరారు.