– రెండోరోజు పేపర్-3కి 45.62 శాతం, పేపర్-4కు 45.57 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-2 రాతపరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈ పరీక్షలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్-2 పోస్టులకు 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. వారిలో 4,13,671 (74.96 శాతం) మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. రెండోరోజు సోమవారం ఎకానమి, డెవలప్‌మెంట్ పేపర్-3కి 2,51,738 (45.62 శాతం) మంది, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం పేపర్-4కు 2,51,486 (45.57 శాతం) అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఆదివారం పేపర్-1కు 2,57,981 (46.75 శాతం) మంది, పేపర్-2కు 2,55,490 (46.30 శాతం) మంది పరీక్ష రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ 29న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే.