ముగిసిన టీయూఐ మహాసభలు

ముగిసిన టీయూఐ మహాసభలు– ప్రపంచ శాంతి, నిరాయుధీకరణకు పిలుపు
– టీయూఐ సెక్రెటేరియట్‌కు విజ్జూ కృష్ణన్‌ ఎన్నిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని, నిరాయధీకరణ అమలు జరగాలని వ్యవసాయం, ఆహారం, వాణిజ్యం, అనుబంధ పరిశ్రమల ట్రేడ్‌ యూనియన్‌ ఇంటర్నేషనల్‌ (టీయూఐ) 5వ అంతర్జాతీయ మహాసభలు పిలుపిచ్చాయి. ఈ మహాసభలు ఈ నెల 9 నుంచి 14 వరకు డాకర్‌ (సెనెగల్‌)లో జరిగాయి. దాదాపు 10కోట్ల మందికి పైగా సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ 86 దేశాల నుంచి 141 వ్యవసాయ, ఆహార, వాణిజ్య, గ్రామీణ, ఆదివాసీ జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరయ్యారు. టీయూఐ ఈ తరహా యూనియన్లలోనే అతి పెద్దది.
టీయూఐ ప్రధాన కార్యదర్శి జూలియన్‌ హక్‌ మహాసభల్లో కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ప్రారంభ సమావేశంలో ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌ పాల్గొని ప్రసంగించారు. నయా ఉదారవాద పెట్టుబడిదారీవాదం, సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా వర్గ పోరాట చర్యలు చేపట్టాల్సిన, అంతర్జాతీయ సంఘీభావం ప్రదర్శించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ ప్రసంగించారు. కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా భారత్‌లో సమస్యల ప్రాతిపదికన సమైక్య పోరాటాలు సాగించిన అనుభవాన్ని వివరించారు. ఈ ప్రసంగానికి ప్రతినిధుల నుండి మంచి స్పందన లభించింది.
భారత ప్రతినిధి వర్గంలో విజ్జూ కృష్ణన్‌, పి.కృష్ణప్రసాద్‌ (ఏఐకేఎస్‌ ఫైనాన్స్‌ కార్యదర్శి), బి.వెంకట్‌ (అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం-ఎఐఎడబ్ల్యుయు, ప్రధాన కార్యదర్శి), విక్రమ్‌ సింగ్‌ (ఎఐఎడబ్ల్యుయు జాయింట్‌ కార్యదర్శి), రావుల వెంకయ్య (ఏఐకేఎస్‌-అజరు భవన్‌ అధ్యక్షులు), గుల్జార్‌ సింగ్‌ గోరియా (భారతీయ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌-బికెఎంయు, ప్రధాన కార్యదర్శి), విజేంద్ర సింగ్‌ నిర్మల్‌ (బికెఎంయు అధ్యక్షులు) వున్నారు.
టీయూఐ కార్యదర్శివర్గానికి విజ్జూ కృష్ణన్‌ ఎన్నికయ్యారు. ఎఐఎడబ్ల్యుయు అధ్యక్షులు ఎ.విజయరాఘవన్‌, గుల్జార్‌ సింగ్‌ గోరియా, రావుల వెంకయ్యలు టీయూఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఎన్నికయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా శాంతి, నిరాయుధీకరణ అమలు జరగాలని మహాసభలు పిలుపిచ్చాయి. ముఖ్యంగా గాజాపై, పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో శాంతి స్థాపన అత్యంత కీలకమని మహాసభ పేర్కొంది. ఆహార సార్వభౌమాధికారం, క్షామంపై, పోషకాహార లోపంపై పోరు కోసం ఉద్యమాలు నిర్మించాలని పిలుపిచ్చాయి. యూనియన్లను మరింత బలోపేతం చేయడం ద్వారా వర్గ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరాయి. a