కాంక్రీట్‌ జంగిల్‌ !

Concrete jungle!– పచ్చదనం మటుమాయం… అటవీ బిల్లుతో అనర్థాలు
అటవీ ప్రాంతంలో పచ్చదనాన్ని హరించి, దీర్ఘకాలంలో వాతావరణ మార్పులపై ప్రతికూల ప్రభావం చూపే అడవుల (సంరక్షణ) సవరణ బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించాయి. ప్రభుత్వం హడావిడిగా ఉభయ సభల చేత బిల్లుకు ఆమోదముద్ర వేయించుకుంది. బిల్లుకు మార్చిలోనే సవరణలు ప్రతిపాదించగా, వాటిని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. అటవీ బిల్లు అనర్థాలకు కారణమౌతుందని పర్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేష్‌ నేతృత్వంలో ఆ కమిటీ పని చేస్తోంది. చివరికి ఎట్టకేలకు బిల్లును పార్లమెంట్‌ సంయుక్త కమిటీ (జేపీసీ)కి నివేదించారు. ఈ కమిటీకి వెయ్యి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కనీసం ఒక్క మార్పును కూడా సూచించలేదు. కమిటీలోని 31 మంది సభ్యులలో ఆరుగురు అసమ్మతి నోట్‌ అందజేశారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి సైతం అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటినీ విస్మరించి, కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ మూజువాణీ ఓటుతో దీనిని ఆమోదించింది.
అభివృద్ధి పేరిట దోపిడీ
2015-20 మధ్యకాలంలో దేశం 6,68,400 హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయింది. ప్రపంచంలో అటవీ భూములను కోల్పోతున్న దేశాల జాబితాలో బ్రెజిల్‌ తర్వాతి స్థానం మనదే. ఇదంతా ‘అభివృద్ధి’ పేరిట జరుగుతున్న దోపిడీ అనే చెప్పాలి. 2018 తర్వాత పర్యావరణ మంత్రిత్వ శాఖ 88,903 హెక్టార్ల అటవీ భూమిని రోడ్ల నిర్మాణం, మైనింగ్‌, రైల్వే లైన్ల ఏర్పాటు నీటిపారుదల ప్రాజెక్టులు వంటి ఇతర అవసరాల కోసం ధారాదత్తం చేసింది. వాతావరణం వేడెక్కడానికి ప్రధాన కారణం అడవుల నరికివేతే. ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణమైన గ్రీన్‌హౌస్‌ వాయువులను కార్బన్‌డైఆక్సైడ్‌ను గ్రహించడం ద్వారా చెట్లు అడ్డుకుంటాయి. అలాంటి సహజ సంపదను అభివృద్ధి పేరుతో నాశనం చేస్తూ పోతే వాతావరణంలో పెను మార్పులు సంభవించి జీవకోటి మనుగడకు విఘాతం కలుగుతుంది. అటవీ ప్రాంతాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించుకునేందుకు అనుమతిస్తున్న సవరణ బిల్లు బడా పారిశ్రామికవేత్తలకు వరంలా పరిణమించింది. మణిపూర్‌లో మైతీలు, కుకీల మధ్య జరుగుతున్న ఘర్షణలకు కారణం కూడా అటవీ భూములే. వీటిపై ఆధిపత్యం కోసం ఈ జాతులు రెండూ తలపడుతున్నాయి.
ఏం జరుగుతుంది?
సవరణ బిల్లు విషయానికి వస్తే ‘అడవులు’ అనే పదాన్ని అది పునర్నిర్వచించింది. చట్టంలో నోటిఫై అయిన అటవీ ప్రాంతానికి మాత్రమే ఈ బిల్లు రక్షణ కల్పిస్తుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ రెవెన్యూ రికార్డులలో ఉన్న అటవీ భూములకు ఇకపై ఎంత మాత్రం రక్షణ లభించదు. పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలు మైనింగ్‌ కంపెనీల బారిన పడతాయి. జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చు.
అన్నింటికంటే దారుణమేమంటే టూరిజం, జంతు ప్రదర్శన శాలలు వంటి అటవీ యేతర ప్రాజెక్టులను అభివృద్ధి చేసుకోవచ్చు. సవరించిన బిల్లు అమలులోకి వస్తే రెండు లక్షల చదరపు కిలోమీటర్ల అటవీ భూమి రక్షణ కోల్పోతుందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది చట్టానికి సవరణ కాదని, మొత్తంగా కొత్త చట్టాన్నే తీసుకొచ్చారని 400 మందికి పైగా పర్యావరణవేత్తలు సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అయితే వారి గోడు పట్టించుకునేది ఎవరు?