కండీషన్స్‌ అప్లై

కండీషన్స్‌ అప్లై– ఒప్పందం తర్వాతే రాహుల్‌ యాత్రలో పాల్గొననున్న ఎస్పీ చీఫ్‌
– సీట్ల పంపకంపై యూపీలో కాంగ్రెస్‌కు అఖిలేశ్‌ షరతు
లక్నో : యూపీలో కాంగ్రెస్‌తో కలిసి నడిచే విషయంలో ఎస్పీ ‘కండీిషన్స్‌ అప్లై’ అంటున్నది. సీట్ల పంపకంపై ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌ షరతులు విధిస్తున్నారు. యూపీలో కాంగ్రెస్‌కు 17 లోక్‌సభ స్థానాలను ఆఫర్‌ చేసినట్టు ఎస్పీ తెలిపింది. సీట్ల పంపకం ఖరారయ్యే వరకు రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని భారత్‌ జోడో న్యారు యాత్రలో పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొనరని వివరించింది. ”మేము కాంగ్రెస్‌కు 17 లోక్‌సభ స్థానాలకు తుది ఆఫర్‌ ఇచ్చాం. మంగళవారం రారుబరేలీలో జరిగే న్యారు యాత్రలో అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొనటం వారి అంగీకారంపై ఆధారపడి ఉంటుంది” అని ఎస్పీ ముఖ్య అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. అయితే కాంగ్రెస్‌కు ఇచ్చే సీట్ల గురించి మాత్రం ఆయన చెప్పడానికి నిరాకరించారు. ”ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వారి నుంచి జాబితాలు వచ్చాయి. మేము వారికి కూడా జాబితాను ఇచ్చాం. సీట్ల పంపిణీ పూర్తయిన క్షణం, ఎస్పీ వారి న్యాయ యాత్రలో చేరుతుంది” అని అన్నారు.
‘ఇండియా’ కూటమిలో ఎస్పీ, కాంగ్రెస్‌లు భాగస్వాములు. ముఖ్యంగా తన రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఇప్పటికే చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఎస్పీ గతంలో కాంగ్రెస్‌కు 11 సీట్లను ఆఫర్‌ చేసింది. అయితే, కాంగ్రెస్‌ రాష్ట్ర యూనిట్‌ మాత్రం ఎక్కువ కేటాయించాలని డిమాండ్‌ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క రారుబరేలీ సీటును మాత్రమే కైవసం చేసుకున్నది. రాహుల్‌ గాంధీ అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ సమయంలో ఎస్పీ అమేథీ, రారుబరేలీలో పోటీ చేయని విషయం విదితమే