– 87 పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు హాజరు
నవతెలంగాణ-లక్ష్మీదేవి పల్లి
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 19, 20 తేదీల్లో మండల స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించింది. మండలాల్లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు సోమవారం లక్ష్మీదేవిపల్లిలోని శ్రీ నలంద జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 87 పాఠశాలల నుండి సుమారు 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బయ్యా అభిమన్యు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి వివేకవర్థిని విద్యాసంస్థల అధినేత ఎంవిఎస్ చౌదరి, త్రివేణి విద్యాసంస్థల అధినేత జి.జగదీష్ హాజరయ్యారు. వారిద్దరూ మాట్లాడుతూ గతంలో అనేక మంది టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించేవారని ఆ ఆనవాయితీ ఇప్పుడు కనుమరుగైందని, ఎస్‌ఎఫ్‌ఐ మాత్రమే ఇప్పుడు టాలెంట్ టెస్ట్‌లు నిర్వహిస్తుందని అన్నారు. పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు టాలెంట్ టెస్ట్‌లు బాగా ఉపయోగపడతాయని, పరీక్షలకు ముందు ఈ టెస్ట్‌లు విద్యార్థులను మానసికంగా ధృఢంగా తయారు చేస్తాయని, విద్యార్థులు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఎదుర్కొనేందుకు పుస్తకాలు బాగా చదవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో అపార జ్ఞానాన్ని పొందుతారని అన్నారు. ఇటువంటి టాలెంట్ టెస్ట్‌లతో విద్యార్థులలో పోటీతత్వాన్ని నెలకొల్పేందుకు రానున్న పరీక్షలకు సన్నద్దం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పరీక్షకు హాజరైన ప్రతీ విద్యార్థికీ కన్సోలేషన్ బహుమతులు అందిస్తామని, మొదటి ముగ్గురికి నగదు బహుమతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. హాజరైన అతిధులు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ప్రారంభించి, ప్రశ్నాపత్రాన్ని హాజరైన విద్యార్థులకు అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ప్రతీ విద్యార్థికీ భగత్ సింగ్ వీలునామా పుస్తకం బహుకరించారు. ఆయన స్పూర్తితో జీవితంలో రాణించాలని పిలుపునిచ్చారు. త్వరలోనే పేపర్ మూల్యాంకనం పూర్తయ్యాక అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులకు బహుమతులు అందజే యనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా హాజరైన విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ భూపేందర్, జిల్లా సహాయ కార్యదర్శులు మందా నాగకృష్ణ, జె.భవ్య, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రామ్ చరణ్, జె.భవ్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రు లు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.