ఉచిత దంత, కంటి వైద్య శిబిరం నిర్వహణ

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో గల ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో జిఆర్ మెమోరియల్ సొసైటీ మరియు ఆక్స్ఫర్డ్ హైస్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుట్ట మరియు పట్టణవాసులకి ఉచిత దంత కంటి వైద్య శిబిరం శనివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలనీవాసులు,  పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మహిళలు, పురుషులు తమ దంత  కంటి సమస్యలను పరీక్షించుకున్నారు.ఈ శిబిరంలో ప్రముఖ దంత వైద్యులు జమాల్పూర్ రాజశేఖర్ అలేఖ్య దంత పరీక్షలు నిర్వహించగా, డాక్టర్ ప్రజ్ఞ వల్లూరు కంటికి సంబంధించిన సమస్యల పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో తొలుత పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు, అలాగే కాలనీవాసులకి వివిధ వైద్య శిబిరాలని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈసారి పట్టణ వాసులకు కూడా కలిపి ప్రత్యేకంగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం జి ఆర్ ఎం సొసైటీ అధ్యక్షులు ముడాల నరేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందిన తర్వాత వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో ఉత్తమ గ్రేడ్ పొందిన విద్యార్థులకు, సమాజంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి వివిధ సందర్భాల్లో సన్మాన కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని తెలిపారు.
చదువులో ఆటంకం కలుగుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, పుస్తకాల వితరణ కూడా చేస్తుంటానని, కార్యక్రమాలను తన పెన్షన్ డబ్బుల నుంచి కేటాయించి నిర్వహిస్తుంటానని తెలియజేశారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన 20 వ డివిజన్ కార్పొరేటర్ న్యాలం రాజు మాట్లాడుతూ, ఆక్స్ఫర్డ్ పాఠశాల స్థాపించిన నుండి నేటి వరకు విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా చక్కటి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం అభినందనీయమని,  ఈరోజు ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఎల్లమ్మ గుట్ట ప్రాంత వాసులకి, పట్టణ వాసులకు నిర్వహించడం ఆనందదాయకమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తుందని వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అలేఖ్య దంత సమస్యల పట్ల విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. దంత సంరక్షణ చేసుకునే విధానాలను తెలియజేశారు. డాక్టర్ ప్రజ్ఞావల్లూరు కంటి సమస్యల  పట్ల అవగాహన కల్పిస్తూ, కళ్ళను సరియైన అవగాహనతో జాగ్రత్తగా కాపాడుకున్నట్లైతే కంటి సమస్యలు రావని దానికి చేయాల్సిన విధానాలని ఆమె తెలియజేశారు.తదుపరి శిబిరానికి విచ్చేసిన డాక్టర్లను, ముఖ్య అతిథిని పాఠశాల యాజమాన్యం శాలువా, మొమెంటుతో ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో జిఆర్ఎం సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి లక్ష్మీనారాయణ, పాఠశాల హెడ్ మాస్టర్ వి. రమణ, గంగాధర్, శ్రీశైలం, స్వప్న, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.