– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 19న సూర్యాపేటలో నిర్వహించనున్న కార్మిక, కర్షక సదస్సును జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జున్‌రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నర్సింహారెడ్డి భవన్‌లో బుధవారం నిర్వహించిన సీఐటీయూ, తెలంగాణ రైతుసంఘం, తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం పదేండ్లకాలంలో అనుసరించిన విధానాల మూలంగా దేశం దివాలా తీసిందన్నారు. ప్రజల సంపద అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టిందన్నారు. దేశానికి తిండి పెట్టే రైతాంగంపై అనేక భారాలు మోపిందన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారు. వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని ఈ పదేండ్లకాలంలో పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి కూలీల జాబ్‌కార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టడం సరికాదన్నారు. రానురాను బడ్జెట్ తగ్గిస్తూ ఉపాధిహామీ చట్టానికి తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈనెల జనవరి 26న టాక్టర్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక, మతోన్మాద విధానాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, అధ్యక్షులు ములకలపల్లి రాములు, జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకటరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొప్పుల రజిత, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.