జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, యదాద్రి భువనగిరి జిల్లా, జిల్లా పరిపాలన యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో శిశు సంరక్షణ – నేటి సమాజంలో జరుగుతున్న అనాగరిక చర్యలు, వాటి పర్యావసణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశాలపై చర్చను నిర్వహించారు. ఈ చర్చలో పాల్గొన్నవారు పాఠశాలలో బోధనా పద్దతి మార్పు రావాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఊయల వ్యవస్థను పటిష్టపరిచాలని, సినిమాలలో కూడా అశ్లీలత్వాన్ని తగ్గించాలని, ప్రజలతో మమైకం అయ్యే అంగన్వాడీ, ఆశావర్కర్లు మరియు సంఘసేవా సభ్యులు తరుచుగా గర్భిణీ స్త్రీల కుటుంబముతో సంప్రదిస్తూ పేద వారికి భరోసా కల్పిస్తూ ఉండాలని, శిశు హత్యలు జరుగకుండా, పిండ నిర్ధారణ పరీక్షలు జరుగకుండా పోలీసు సంబంధిత వ్యవస్థలు నిరంతర నిఘా ఉంచాలని, బాల్య వివాహాలు జరుగకుండా నిరోదించే దిశగా కృషి చేయాలని తెలిపారు. ఇటీవల కాలంలో జరిగిన నవజాత శిశువులను కుక్కలు నోటికి కరుచుకొని పోవటం నేటి సమాజ నాగరిగతకు పెను సవాల్ అని తెలిపారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మారుతి దేవి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి శిశు అమ్మకాలను, బ్రూన హత్యలను ఆపాలని ఇలాంటి చర్చలు అనేకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి కె. మురళి మోహన్ మాట్లాడుతూ సంఘములో జరుగుతున్న ఈ అనాగరిక చర్యలపై సరైన చర్చ జరిగింది. యంత్రాంగాన్ని తద్వారా ప్రజలను జాగ్రతం చేయటానికి ఈ కార్యక్రమం నిర్వహించటం జరిగిందని తెలిపారు, దీనికై న్యాయ సేవ సంస్థ అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. కవిత, భువనగిరి ఎ. సి. పి వెంకట్ రెడ్డి, డి. యం. హెచ్. ఒ పరిపూర్ణచారి, ఐ. ఎం. ఎ అధ్యక్షులు డా.విజయ భార్గవ్, స్త్రీ, శిశు సంక్షేమ అధికారిని అన్నపూర్ణ, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, డి. సి. పి. ఒ సైదులు, పబ్లిక్ ప్రాసెక్యూటర్స్ శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, డాక్టర్లు, సఖీ సెంటర్ డా. ప్రమీల, అడ్మిన్ లావణ్య, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు పారా లీగల్ వాలంటీర్లు ముక్త కంఠంతో శిశు భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు నిరోదించాలన్నారు. మానవ నాగరికతకు ఒక అర్ధం చేకూరాలని తెలిపారు. కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పోలీసు యంత్రాంగం, డాక్టర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, సి డబ్ల్యూ సి సభ్యులు పాల్గొన్నారు.