– క్రీడా దేశంగా ఎదుగుతున్న భారత్
– భారత అథ్లెటిక్ సూపర్‌స్టార్ నీరజ్ చోప్రా
నవతెలంగాణ-హైదరాబాద్
భారతీయ క్రీడాకారులు ఇప్పుడు భయమెరుగని ప్రదర్శన చేయగల్గుతున్నారు. ఆత్మవిశ్వాసంతో ప్రపంచ మేటి అథ్లెట్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. భారత్ క్రీడా దేశంగా ఎదుగుతుందని భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ సూపర్‌స్టార్..ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా అన్నాడు. హైదరాబాద్‌లోని ఓ స్పోర్ట్స్‌వేర్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నీరజ్ చోప్రా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.
క్రీడా దేశంగా భారత్ : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు), ప్రభుత్వాలు సహా పలు కార్పోరేట్ సంస్థలు గొప్పగా మద్దతు అందిస్తున్నాయి. మెగా ఈవెంట్లకు ముందు సారు విలువైన క్యాంప్‌లు నిర్వహిస్తూ క్రీడాకారుల్లో నైపుణ్యాలకు సానపడు తుంది. భారత క్రీడాకారులు మునుపటిలా లేరు. ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ప్రపంచ శ్రేణి అథ్లెట్లతో పోటీపడేందుకు దూకుడుగా ముందుకొస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో పతక వేటలో పోరాట పటిమ కనబరుస్తున్నారు. అతి త్వరలోనే భారత్‌ను క్రీడా దేశంగా చూడబోతున్నామని చోప్రా అన్నాడు.
టార్గెట్ 90మీ : ఒలింపిక్స్ పసిడి, ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్, డైమండ్ లీగ్ టైటిల్, ఆసియా గేమ్స్ గోల్డ్.. ఇలా జావెలిన్ త్రోలో అత్యుత్తమ విజయాలు అన్నీ సాధించాను. అయినా, మరోసారి ఈ ఘనతలను మరింత మెరుగ్గా సాధించాలనే సంక్పలం నన్ను నడిపిస్తోంది. స్విమ్మర్ మైకల్ ఫెల్ఫ్స్, స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌లు ఈ విషయంలో నాకు స్ఫూర్తి. ఒకే మెడల్‌ను మరింత మెరుగైన ప్రదర్శనతో సాధించాలనే తపన నాలో ఉంది. బల్లెంను 90మీటర్ల దూరం విసరాలనే లక్ష్యం ఉంది. కానీ ఆ విషయంలో తొందర ఏమీ లేదు. ఒక్కో మెట్టు ఎదుగుతూనే ఆ లక్ష్యం చేరుకుంటానని నీరజ్ తెలిపాడు.
అప్పుడే ఫిర్యాదులొద్దు! : నా విజయాలతో స్ఫూర్తి పొంది చిన్నారులు స్పోర్ట్స్‌ను ఎంచుకుంటున్నారనే మాట.. నాకు ఎంతో సంతృప్తి కలిగిస్తోంది. కానీ తల్లిదండ్రులు ఆరంభ దశలోనే వసతులు,సౌకర్యాల లేమీ పట్ల ఫిర్యాదులు చేయకూడదు. కాస్త సహనంగా వ్యవహరించాలి. తొలుత చిన్నారులు ఆటతో అనుబంధం ఏర్పరుచుకునేలా చూడాలి. ఆట పట్ల ఆరాధన భావం వచ్చేంతవరకు వేచి చూడాలి. నేనూ కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో రైలు ప్రయాణం చేశాను. ఎంతోమందితో కలిసి రూమ్‌ను పంచుకున్నాను. ఇప్పుడు మన దగ్గర అన్ని నగరాల్లో క్రీడా మౌళిక వసతులు అందుబాటులోకి వచ్చాయని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా గచ్చిబౌలీలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని నీరజ్ చోప్రా సందర్శించాడు.
ఫ్లాప్ అవుతుంది!! : భారత క్రీడా ముఖచిత్రం నీరజ్ చోప్రా. ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో క్రీడా దిగ్గజాల బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. భారత క్రీడా చరిత్రలో గోల్డెన్ బారు, సూపర్‌స్టార్ నీరజ్ చోప్రా. ప్రపంచంలో జావెలిన్ త్రోలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ విజయాలు అన్నీ నీరజ్ చోప్రా ఇప్పటికే సొంతం చేసుకున్నాడు. దీంతో నీరజ్ చోప్రా బయోపిక్ తీసేందుకు సినీ వర్గాల్లో ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిపై నీరజ్ చోప్రాను అడుగగా.. ఇలా స్పందించాడు. ‘నా జీవితకథతో బయోపిక్‌ను తీసేందుకు ఎవరైనా నిర్మాత నా దగ్గరకు వస్తే.. తొలుత హీరోకు జావెలిన్‌ను ఎలా విసరాలనే అంశంలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్తాను. ఎందుకంటే జావెలిన్‌ను విసరటం అంత తేలిక కాదు. ఒకవేళ సినిమాలో హీరో జావెలిన్‌ను సరిగ్గా విసరలేకపోతే.. మొత్తం మూవీ ఫ్లాప్ అవుతుంది. జనాలు అరే ఎందీ ఈటను ఇలా విసురుతున్నాడని హేళన చేస్తారని..’ నవ్వుతూ నీరజ్ చోప్రా సమాధానం ఇచ్చాడు.