– శవపరీక్ష అనంతరం అధికారులు వెల్లడి
– మణిపూర్‌లోని తెంగ్నౌపాల్‌లో ఇటీవల 13 మృతదేహాలు లభ్యం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని మయన్మార్ సరిహద్దు సమీపంలో తుపాకీ కాల్పుల్లో మరణించిన 13 మంది మెయిటీ పురుషుల గుర్తింపును అధికారులు నిర్ధారించారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోవైద్యులు శవపరీక్ష నిర్వహించిన తర్వాత అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో బుల్లెట్ గాయాలతో కూడిన మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసు సూపరింటెండెంట్ లుయిఖం లాన్మియో తెలిపారు. కుకీ-జోమి కమ్యూ నిటీ ఆధిపత్యం ఉన్న లీతు గ్రామంలో ఈ మృతదేహాలు కనుగొనబడ్డాయి. ఉదయం 10.30 గంటల సమయంలో కాల్పుల శబ్దాలు వినిపించడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. మృతదేహాల వద్ద ఎలాంటి ఆయుధాలు లభించలేదన్నారు.చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఇంఫాల్ లోయలోని మెయిటీ-ఆధిపత్య జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులని తెలిపారు. లీతు గ్రామంలో హింసాత్మక ఘటనలు నమోదవటం ఇదే ప్రథమం కావటం గమనార్హం. రాష్ట్రంలో ఈ ఏడాది మే 3 నుంచి మెయిటీలు, కుకీ-జో వర్గాల మధ్య చెలరేగిన హింసలో ఇప్పటి వరకు దాదాపు 200 మంది వరకు మరణించగా.. 60,000 మంది వరకు ప్రజలు నిరాశ్రయులయ్యారు.