కౌలు రైతుల్లో కలవరం…

rythu-bandhu-scheme– పెరిగిన పెట్టుబడి
– పంటకు దక్కని గిట్టుబాటు
– అప్పుల భారం తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగడుతున్న వైనం
– ఏటా నమోదవుతున్న ఘటనలు…
భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన కౌలు రైతు ఎడిపెల్లి రమేష్‌(50) 12 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశారు. పంట సరిగా పండక.. దిగుబడి రాక.. గిట్టుబాటుగాక అప్పు తీరదనే బెంగతో ఇంట్లో పురుగు మందు తాగి ఉరేసుకున్నాడు. ఇలా ఎంతో మంది రైతులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏటా ప్రాణం తీసుకుంటుం డటం.. కౌలు రైతుల కుటుంబాల దుర్భర స్థితిని తెలియజేస్తోంది. భూమిని కౌలుకు తీసుకుని పెట్టుబడులు పెట్టి.. కాయకష్టం చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి నానాటికీ మరింత దిగజారుతోంది. వచ్చిన లాభంలో పెట్టుబడి కోసం తీసుకొచ్చిన అప్పులు చెల్లించడంతోపాటు కౌలు డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పంట పండకపోతే పెట్టుబడి కోల్పోవడంతో పాటు కౌలు డబ్బులు చేతి నుంచే చెల్లించాల్సి వస్తుంద టంతో అప్పుల భారం మరింత పెరిగిపోతోంది. పంట పండక.. చేసిన అప్పులు చెల్లించలేక.. ప్రభుత్వాల నుంచి సాయం అందకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి ఏటా ఎంతో మంది ఇలా ప్రాణం తీసుకుంటున్నా.. కుటుంబాలు రోడ్డున పడుతున్నా పాలకులు దృష్టిసారించడం లేదు. తాజాగా రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
నవతెలంగాణ – ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయం మాత్రమే తెలిసి.. అదే జీవనాధారంగా రైతులు బతుకుతున్నారు. సొంత భూమి లేకపోయినా.. ఇతరుల నుంచి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1,17,268మంది రైతులు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్‌లో 28,763మంది, నిర్మల్‌లో 33,212మంది, మంచిర్యాలలో 28,584, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 26,754మంది కౌలు రైతులు వ్యవసాయం సాగిస్తున్నారు. కౌలు రైతులకు గతంలో ప్రభుత్వం రుణ అర్హత కార్డులు అందజేసినా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని తొలగించింది. పహాణీల నుంచి కాస్తు కాలమ్‌ కూడా తొలగించింది. దీంతో పంటలు పండించిన కౌలు రైతులకు వాటిపై ఎలాంటి హక్కూ ఉండదు. పంట అమ్ముకోవాలన్నా భూ యజమాని పేరుపై విక్రయించాల్సి వస్తుంది. మరోపక్క కౌలు వ్యవసాయం గతంలో కొంత లాభం చేకూరినా.. ప్రస్తుతం పెరిగిన కౌలు డబ్బులతో పాటు పెట్టుబడి కూడా భారీగా పెరగడం.. మరోపక్క ప్రకృతి సహకరించకపోవడం వంటి కారణాలతో పంటలు పండించడం కష్టంగా మారిందని రైతులు అంటున్నారు.
అప్పులు తీర్చలేక అవస్థలు..!
ఏటా వ్యవసాయం లాభదాయకంగా ఉండటం లేదు. పంట కోసం దళారులు, ఇతరుల వద్ద అప్పులు తీసుకురావాల్సి వస్తోంది. ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయమూ అందడం లేదు. రుణ అర్హత కార్డు లేకపోవడంతోపాటు ఫసల్‌ బీమా వర్తించదు. వాతావరణ ఆధారిత బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. నకిలీ విత్తనాల బెడద, పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు లేకపోవడం, ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం తదితర కారణాలతో కౌలు రైతులు దయనీయ స్థితిని ఎదుర్కొవాల్సి వస్తోంది.

ఇప్పటికైనా మేలు జరిగేనా..?
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా మేలు చేస్తామని హామీనిచ్చింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతుభరోసా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం అమల్లో భాగంగా రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామని భరోసా ఇచ్చింది. దీంతో ప్రభుత్వం భరోసా కౌలు రైతులకు కొంత ఊరట చెందే పరిణామంగా మారింది. కౌలు రైతుల పేర్లు గుర్తించడంతో పాటు వారికి ఏటా ఈ సాయం అందిస్తామని చెప్పడంతో కొంతైనా లాభం చేకూరే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కౌలు రైతులు పడుతున్న బాధ కొంతైనా తీరుతుందని ఆశిస్తున్నారు.