– ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలపై వీడని మిస్టరీ
– ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సింధు శర్మ
నవతెలంగాణ-భిక్కనూర్/సదాశివనగర్/కామారెడ్డి
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఎస్‌ఐ, మహిళా కాని స్టేబుల్‌తో పాటు, ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య పోలీసుశాఖలో కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా గజ ఈతగాళ్ల సాయంతో గాలించి ముగ్గురి మతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ‘కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని ఎస్పీ సింధు శర్మ మీడియాకు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఎస్సై సాయికుమార్‌ది మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రం. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భవతి. కానిస్టేబుల్ శృతి భర్తతో విడాకులు తీసుకొని కుటుంబ సభ్యులతో గాంధారిలో నివసిస్తోంది. బీబీపేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. నిఖిల్‌ది బీబీపేట్ మండల కేంద్రం. ఆయన అక్కడే ఓ సొసైటీలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఎస్సై, కానిస్టేబుల్‌కు ఉన్న సంబంధమేంటి?, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?, ఒకేసారి ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణాలేంటి? అనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు మృతదేహాలను పరిశీలించారు. మరణానికి గల కారణాలను పోలీసుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మరణించిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.