చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు అభినందనలు

– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్వీట్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు నా అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ…సమస్యలను పరిష్కరించుకుంటూ…అభివృద్ధి పథం వైపు సాగుదాం. అద్భుతమైన విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈమేరకు మంగళశారం ట్వీట్‌ చేశారు.
కాంగ్రెస్‌ క్యాడర్‌కు అభినందనలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
రికార్డు స్థాయి మోజార్టీ సాధించేందుకు కృషి చేసిన క్యాడర్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందనలు ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే కాంగ్రెస్‌ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు స్పందించి ఇండియా కూటమి అభ్యర్థులను అద్భుతంగా గెలిపించిన అందినందుకు దేశ, రాష్ట్ర ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ప్రజా తీర్పును కాంగ్రెస్‌ గౌరవిస్తుంది
రాష్ట్ర, దేశ ప్రజలకు కృతజ్ఞతలు
మహేష్‌ కుమార్‌ గౌడ్‌
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ప్రజాతీర్పును గౌరవిస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. తెలంగాణ, దేశ ఓటరులందరికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌ యాదవ్‌, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ప్రభుత్వ ప్రతినిధి హర్కర వేణుగోపాల్‌, మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ వైస్‌ చైర్మెన్‌ ఫహీం ఖురేషి, డీసీసీ అధ్యక్షులు రోహిన్‌ రెడ్డి, మెట్టు సాయి, సంగిశెట్టి జగదీష్‌ తదితరులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఐదు హామీలను అమలు చేశామని పేర్కొన్నారు. కంటోన్మెంట్‌లో శ్రీగణేష్‌ను గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గాంధీభవన్‌లో సంబురాలు
టపాకాయలు పేల్చి ఆనందం పంచుకున్నారు
గతం కంటే ఐదు స్థానాలు అదనంగా గెలిచినందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం గాంధీభవన్‌లో సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి, డ్యాన్స్‌లు చేస్తూ…తమ ఆనందం పంచుకున్నారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో విజయం సాధించడం, ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీ వచ్చినందుకు కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.