సీఎం రేవంత్‌రెడ్డికి అభినందనలు

– కొత్త రేషన్‌కార్డులివ్వాలి..ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలి
– గుడిసెవాసులకూ ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకం వర్తింపజేయాలి : వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నూతనంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు అభినందనలు తెలిపారు. ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజూ ప్రజాదర్బార్‌ నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ జాబ్‌ కార్డులు లేని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయనీ, వారికి కార్డులివ్వాలని కోరారు. ఉపాధి హామీ చట్టం పనుల్ని వ్యవసాయానికి అనుసంధానిస్తామని చెప్పడం సరిగాదనీ, దాన్ని వెనక్కి తీసుకోవాలని విన్నవించారు. ఇంటిస్థలముంటే రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ వారికి స్థలమిచ్చి రూ.6 లక్షలతో ఇందిరమ్మ పక్కా ఇండ్లు కట్టిస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 69 కేంద్రాల్లో లక్ష పేద కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాయనీ, ఆ కుటుంబాలకూ ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులివ్వాలనీ, 14 రకాల నిత్యావసర సరుకులను ఇవ్వడంతో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు పేదలకు భూమి పట్టాలివ్వాలని కోరారు. ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.