సీఎం రేవంత్‌రెడ్డి సీఐటీయూ అభినందనలు

సీఎం రేవంత్‌రెడ్డి సీఐటీయూ అభినందనలు– కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నూతనంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎనుముల రేవంత్‌రెడ్డికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం కార్మికుల సమస్యల సత్వర పరిష్కారానికి తగిన ప్రాధాన్యతనిచ్చి పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ తన అభయహస్తం మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలతో పాటు కార్మిక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే సమస్యలను కూడా సత్వరం పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. గురువారం ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ జీఓలను సవరించాలనీ, విడుదలైన ఐదు జీఓలకు గెజిట్‌ జారీ చేసి కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలనీ, సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. స్కీమ్‌ వర్కర్లను కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత చట్టాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల్లో పనిచేసే గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచడం, ఉద్యోగ భద్రత కల్పించడం, అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయడం, నూతన పెన్షన్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి చేయాలని కోరారు. బీడీ పరిశ్రమ రక్షణకు చర్యలు తీసుకోవాలనీ, బీడీ కార్మికులందరికీ షరతులు లేకుండా జీవనభృతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీల్లోని కారోబార్‌, బిల్‌ కలెక్టర్లకు స్పెషల్‌ స్టేటస్‌ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలను పర్మినెంట్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని, ఐకెపి విఓఏలకు కనీస వేతనాలు నిర్ణయించి సెర్ప్‌ ద్వారా ఇవ్వాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలనీ, రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు, స్కీంవర్కర్ల సమ్మెల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లు మద్దతు తెలిపారనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేశారు.