రైతు రుణమాఫీ పట్ల తెలంగాణ రైతులకు అభినందనలు

– కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ట్వీట్‌
– బీజేపీ రైతులను అప్పుల ఊబిలో బంధిస్తుందని విమర్శ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రుణమాఫీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ రైతులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. ‘మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీని విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని 6.4 లక్షల రైతు కుటుంబాలకు రూ. 1.5 లక్షల వరకు రుణమాఫీ ఉపశమనం కల్పిస్తుంది.’ అని పేర్కొన్నారు. అయితే దేశంలోని రైతులను బీజేపీ అప్పుల ఊబిలో బంధించిందని తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టపరమైన హామీని కేంద్రం తిరస్కరించిందని గుర్తు చేశారు. అయితే సాధ్యమైన ప్రతిచోటా వ్యవసాయ కుటుంబాలకు సహాయం అందించేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.