కాంగ్రెస్‌ అకౌంట్లు సీజ్‌

Congress accounts seized– ఆదాయ పన్ను శాఖ వెల్లడి
– అనుమతించిన ఐటీ అప్పిలియేట్‌ ట్రిబ్యునల్‌
– అధికార మత్తులో ప్రతిపక్ష పార్టీ అకౌంట్లు సీజ్‌
– ప్రజాస్వామ్యంపై దాడి : కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
– కాంగ్రెస్‌కు ప్రజా బలం ఉంది : రాహుల్‌ గాంధీ
– పార్టీ అకౌంట్ల సీజ్‌ పై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమైన అనుబంధ సంఘాల అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ సీజ్‌ చేసింది. పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన మొత్తం 9 అకౌంట్లను ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగం సీజ్‌ చేసింది. ఆదాయ పన్ను శాఖ పంపిన నోటీసులకు సదరు అనుబంధ సంఘాలు సరైన స్పందన ఇవ్వకపోగా.. జరిమానా కూడా చెల్లించలేదని.. దీంతో అకౌంట్లు సీజ్‌ చేసినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. 2018-19 లో ఆదాయ పన్ను శాఖ విధించిన జరిమానా, నోటీసులకు ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘాలు స్పందించ లేదని ఆదాయపన్ను శాఖ తెలిపింది. అకౌంట్లు సీజ్‌ చేస్తున్నట్టుగా కాంగ్రెస్‌ పార్టీ, దాని అనుబంధ విభాగాలకు సమాచారం పంపింది. దీంతో కాంగ్రెస్‌ ఐటీ అప్పిలియేట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆదాయపు పన్ను సీజ్‌ చేసిన అకౌంట్లను ఉపయోగించుకునేందుకు ఐటీ అప్పిలియేట్‌ ట్రిబ్యునల్‌ అనుమతించింది.
ప్రజాస్వామ్యంపై దాడి
కాంగ్రెస్‌కి చెందిన బ్యాంక్‌ అకౌంట్లను సీజ్‌ చేయడం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై లోతైన దాడి అని తెలిపారు. అధికార మత్తులో ఉన్న మోడీ సర్కార్‌ లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ ఖాతాలను స్థంభింపజేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నగదు రూపంలో డిపాజిట్‌ చేసిన రూ.14.40 లక్షలకు, గతంలో ఐటీ శాఖ ఏకంగా రూ. 210 కోట్ల జరిమానా విధించిందని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ చిన్నసాకుతో ఆదాయపు శాఖ కాంగ్రెస్‌ పార్టీ, అనుబంధ సంస్థ అయిన యువజన కాంగ్రెస్‌ బ్యాంక్‌ అకౌంట్లను సీజ్‌ చేసిందని ఆరోపించారు. ఈ అంశంపై సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా ఖర్గే స్పందించారు. రాజ్యాంగ విరుద్దమైన ఎలక్టోరల్‌ బాండ్లను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత బీజేపీ ఖాతాలు సీజ్‌ చేయాలని అన్నారు. ఇప్పటికే ఇందులో 95 శాతానికి పైగా నిధుల్ని బీజేపీ జేబులో వేసుకుందని ఆరోపించారు. అంతేకానీ క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సేకరించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ కాదన్నారు. ‘ర్యాజ్యాంగ విరుద్ధంగా సేకరించిన డబ్బును బీజేపీ ఎన్నికల్లో ఖర్చు చేస్తోంది. మేము క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సేకరించిన నిధుల్ని సీజ్‌ చేశారు’ అని విమర్శించారు. మోడీ మూడోసారి గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతమవుతుందని మరోసారి వ్యాఖ్యానించారు. అందుకే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని గతంలోనే హెచ్చరించానన్నారు.
కాంగ్రెస్‌ ది డబ్బు కాదు… ప్రజా బలం
కాంగ్రెస్‌ పార్టీకి డబ్బు బలం కాదని, ప్రజల బలం ఉందని అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. నియంతృత్వ బెదిరింపులకు కాంగ్రెస్‌ లొంగదని స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని అన్ని విధాలుగా పరిరక్షించేందుకు, ప్రతి ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త పోరాడుతారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ఒక నెల ముందు, ప్రతిపక్ష పార్టీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేపట్టకుండ బీజేపీ ఒక బలహీన చర్యలను ఎంచుకుందని పార్టీ జనరల్‌ సెక్రటరీ(సంస్థాగత) కెసి వేణుగోపాల్‌ విమర్శించారు. బీజేపీ తన అకౌంట్లలో కోటికిపైగా నిల్వచేసిందని విమర్శించారు. అక్రమ ఎలక్టోరల్‌ బాండ్‌ స్కాంతో రూ. 6,500 కోట్లు చెక్కు చెదరకుండా ఆ పార్టీ అకౌంట్‌లో మిగిలిపోయాయన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు ముందు ఉద్దేశపూర్వకంగా అకౌంట్ల సీజ్‌ జరిగిందని పార్టీ కోశాధికారి అజరు మాకెన్‌ విమర్శించారు. అకౌంట్ల రిలీజ్‌ కోసం చట్టపరమైన మార్గాలను అన్వేశిస్తున్నామని, తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు.