కాంగ్రెస్‌వి గోబెల్స్‌ను మించిన అబద్దాలు..

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గోబెల్స్‌ బతికుంటే కాంగ్రెసోళ్ల అబద్దాలు చూసి ఆత్మహత్య చేసుకునే వారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ,కె పి వివేకానంద ,కోవా లక్ష్మి , బీఆర్‌ఎస్‌ నేతలు రాకేష్‌ రెడ్డి , రాంబాబు యాదవ్‌ ,తుంగ బాలు విమర్శించారు. రైతులకంతా మేమే చేశామనీ, కేసీఆర్‌ హయంలో ఏం జరగలేదన్నట్టుగా వారు మాట్లాడుతున్నారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం విడుదల చేసింది రూ. 6 వేల కోట్లు మాత్రమేననీ, ఇది రుణాలున్న రైతుల్లో 30 శాతం మందికే సరిపోతుందని పేర్కొన్నారు. డబ్బుల పరంగా చూస్తే ఇది 20 శాతం మాత్రమేనన్నారు.కాంగ్రెస్‌ నేతలు గోరంత చేసి, కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ హయంలో మొదటి విడతలో 35 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లు రుణ మాఫీ కింద చెల్లించామని గుర్తు చేశారు. రైతుల అకౌంట్లలోకి పదేండ్లలో రూ. లక్ష కోట్ల వేశామన్నారు.రూ. 70 వేల కోట్లు రైతు బంధు, రూ. 30 వేల కోట్ల రుణ మాఫీతో పాటు లక్షా 20 వేల మంది రైతుల కుటుంబాలకు రూ. 7వేల కోట్లను బీమా కింద చెల్లించారని గుర్తు చేశారు.