– ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ. డాక్టర్ కె.లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టామ్ అండ్ జెర్రీ మాదిరిగా ఫైట్ చేసుకుంటున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మట్లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దేశభద్రతకు సంబంధించిన అంశం కాబట్టి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 నుంచి ఇప్పటి వరకూ అసెంబ్లీ, పార్లమెంట్, ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి బీఆర్‌ఎస్ లబ్ది పొందిందనీ, ప్రముఖ వ్యాపారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఓనర్లు, హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి డబ్బులు దోచుకున్నారనే వార్తలొస్తున్నా ఎందుకు విచారణ చేయించడం లేదని నిలదీశారు. ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా బుక్ అయినప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసి కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్‌ను కలిసి విచారణ జరిపేలా కోరుతామనీ, ఈ కేసు నుంచి అసలు దోషులను తప్పించే కుట్రను ఎండగడుతామని తెలిపారు.