– గత ప్రభుత్వం కంటే రేవంత్‌రెడ్డి సర్కారు నయమే : మాజీ ఎంపీ కొండా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదనీ, బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ కృషి వల్ల మూడు నెలల్లో మనదేశ జీడీపీ వృద్ధిరేటు 8 శాతానికి పెరిగిందన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప కులాల వారీగా ఉచితాలు సరిగాదని అభిప్రాయపడ్డారు. గత కేసీఆర్ సర్కార్‌తో పోలిస్తే ప్రస్తుతమున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొంత నయమేనని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో అసెంబ్లీలో బూతులు వాడే వారని, ఈసారి కొంత హుందాగా నడిచిందని తెలిపారు. గత ప్రభుత్వం చేతిలో చిప్పపెట్టిపోయిందనీ, రైతుబంధు, ఇతర పథకాలకు డబ్బులు లేవని చెప్పారు. కేసీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్తే, ప్రజలు ఇబ్బందులు పడకూడదని కేంద్రం నిధులిస్తోందన్నారు. తెలంగాణలో 14, 15 ఎంపీ సీట్లు గెలిపిస్తే రూ.9 లక్షల కోట్లు కాదు, 25 లక్షల కోట్లు తీసుకొస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అన్న ప్రచారాన్ని కొట్టిపడేశారు. కాళేశ్వరం మొత్తాన్ని విడిచిపెట్టి మేడిగడ్డ ఒక్కదాన్ని మాత్రమే పట్టుకుంటున్నారని విమర్శించారు. చేవెళ్లతో తానే గెలుస్తానని స్పష్టంచేశారు. అయితే, ఇప్పటి వరకూ టికెట్ తనకు ఇస్తున్నట్టు ఎవ్వరూ చెప్పలేదన్నారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం మాట్లాడుతూ ..కాంగ్రెస్ ఇస్తానన్న గ్యారెంటీలు సరిగ్గా అంద జేయాలని సూచించారు. కృష్ణా, గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లాకు అందలేదన్నారు. ఇప్పుడున్న ఎంపీ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ పరిధిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. సమా వేశంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.రంగా రెడ్డి, నేతలు ప్రభాకర్‌రెడ్డి, కిరణ్‌గౌడ్, అజ్మీరా బాబీ, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.