నవతెలంగాణ -ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ చొరస్తా లో కార్నర్ మీటింగ్ లో భాగంగా కాంగ్రెస్ నియోజకవర్గ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి మాట్లాడుతూ… ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఆర్మూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా, మోసపూరిత బీఆర్ఎస్ పార్టీని గత పది సంవత్సరాలుగా ఒక్క డబుల్ బెడ్ రూమ్ అయినా ఇల్లు నిర్మించి ఇచ్చిందా, అలాగే కరోనా సమయంలో ప్రజలను ఆదుకుందా, నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించిందా ఏ ఒక్క హామీలను కూడా నెరవేర్చని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వెయ్యకండి అని ఆయన అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం ప్రజలను ఈ ఎమ్మెల్యే ఎంతో మోసం చేశాడని అన్నారు. ఎదురుతిరిగితే కేసులు పెట్టాడని, అహంకారంతో ఆర్మూర్ నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేసి భూకబ్జాలు చేశాడని అన్నారు. ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే ఆర్టీసీ కి 7 కోట్లు బకాయి ఉన్నాడని ఆరోపించారు. నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిందని, నిరుద్యోగులకు ఇప్పటికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక్క లక్ష ఎనభై రెండు వేలు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం వేస్తామని ఆయన తెలిపారు. ప్రజల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకు రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బాండ్ పేపర్ పై సంతకం చేసి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారంటీల పథకాలను ఆయన వివరించారు. మొదటిది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు, 500 కి గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షల రూపాయలు, స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 15000 రైతులకు, కౌలు రైతులకు ఇస్తామని, అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, అలాగే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని తెలిపారు, చేయూత పథకం కింద 57 సంవత్సరాలు నిండిన, అర్హత ఉన్న వృద్ధులు అందరికీ నెలవారి పింఛన్ 4000 రూపాయలు ఇస్తామని, అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా వెళ్లొచ్చని అన్నారు. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తామని ఆయన అన్నారు. కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.