రైతుబంధుపై కాంగ్రెస్‌ కుట్ర

రైతుబంధుపై కాంగ్రెస్‌ కుట్ర– మాది రైతులతో… పేగు బంధం
– కుట్రపూరితంగానే ఈసీ లేఖలు : మండిపడ్డ మంత్రి హరీశ్‌రావు
– వచ్చేనెల 3వ తేదీ తరువాత రైతుబంధు డబ్బులు పంపిణీ
నవతెలంగాణ-ఝరాసంగం
కాంగ్రెస్‌ పార్టీ రైతుబంధు పథకంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని, పలుమార్లు ఈసీకి కావాలనే లేఖలు రాసి, రైతుబంధు పంపిణీకి అడ్డుపడిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్‌ ఎంపీ బి.బి పాటిల్‌ పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘మాది రైతులపై ఓటు బంధం కాదని.. రైతులపై పేగు బంధం’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో రాబోయేది మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని.. వచ్చేనెల 3 తేదీ తరువాత రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులు పడతాయని ధీమా వ్యక్తం చేశారు. పక్కనున్న కర్నాటకలో రైతులకు కరెంటు లేక.. స్కాలర్‌షిప్స్‌ రాక.. సరైన పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే రిస్క్‌లో పడతామని తెలిపారు. జహీరాబాద్‌ ప్రాంత రైతులకు లక్ష ఎకరాలకు గోదావరి నీళ్లు అందించే బాధ్యత తనదేనని చెప్పారు. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల ఏర్పాటు, దేవాలయాలు, మసీదుల్లో పనిచేసే పూజరులు, ఇమాములకు జీతాలు పెంచుతామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ నర్వోత్తం, మాజీ రాష్ట్ర బేవరే జెస్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ దేవి ప్రసాద్‌, సీడీసీ చైర్మెన్‌ పాటిల్‌, మండలాధ్యక్షులు వెంకటేశం, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు జగదీశ్వర్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.న