రైతు బంధు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్‌ కుట్ర

– మాజీమంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సాగుకు పెట్టుబడి సాయం అందించి, రైతులకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టే కుట్రకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెర లేపిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా విమర్శించారు. రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనస్సే మేలంటూ రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొనడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రపంచం లో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేశారని చెప్పారు.
ఆ లెక్కన చూసుకుంటే రైతులకు దక్కిన బోనస్‌ సుమారు రూ. 26 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు.పెండింగ్‌లో ఉన్న వానకాలం రైతుబంధుతో పాటు, యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.