కాంగ్రెస్‌ డకౌట్‌..బీజేపీ రనౌట్‌..

Congress Duckout..BJP Runout..– ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో
– నడ్డా నడ్డి విరిచే ప్రణాళిక ఉంది
– దానిపైనే సీఎం సుదీర్ఘ సమాలోచనలు
– మంచిర్యాల జిల్లా పర్యటనలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ- హాజీపూర్‌, చెన్నూర్‌
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నడ్డి విరిచే ఎన్నికల ప్రణాళిక మా దగ్గర ఉందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ఉంటుందని చెప్పారు. దానిపైనే సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమాలోచనలు చేస్తున్నారని తెలిపారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌, హాజీపూర్‌ మండలాల్లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో ఆయన మాట్లాడారు. సొంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేని నడ్డా ఆటలు ఇక్కడ సాగవన్నారు. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే కనీసం పరువైనా దక్కుతుందని విమర్శించారు. బీజేపీ చేరికల కమిటీ అట్టర్‌ ప్లాప్‌ అయిందన్నారు. రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడదని బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ డకౌట్‌.. బీజేపీ రన్‌ఔట్‌ అవుతాయని.. బీఆర్‌ఎస్‌ మాత్రం సెంచరీ కొడుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవన్నారు. రేవంత్‌రెడ్డి మారని పార్టీ లేదని, అలాంటి వ్యక్తిని ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. వృద్ధాప్య పింఛన్‌ పెంచే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని చెప్పారు. ప్రాణహిత, గోదావరి నదుల తీర ప్రాంతాల్లో కరకట్టలు నిర్మించి.. మునిగిపోయిన పంట పొలాలను రీసర్వే చేయించి రైతులకు నష్టపరిహారం అందించే ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. చెన్నూర్‌ అభివృద్ధి ఆగకూడదంటే మళ్లీ బాల్క సుమన్‌ను గెలిపించాలని అభ్యర్థించారు.