కాంగ్రెస్‌ కసరత్తు షురూ

Congress exercise started– పార్లమెంట్‌ ఎన్నికలపై గాంధీభవన్‌లో 3న విస్తృతస్థాయి సమావేశం
–  17 సీట్లపై ఫోకస్‌
– బరిలోకి బలమైన అభ్యర్థులు
– ,అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన స్థానాలపై ప్రత్యేక దృష్టి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పార్లమెంటు ఎన్నికలపై టీపీసీసీ కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికల్లో మూడు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో 17 స్థానాలనూ కైవసం చేసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. కాంగ్రెస్‌ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి పార్లమెంటు ఎన్నికలు మొదటి సవాల్‌గా మారాయి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ పావులు కదుపుతున్నది. ఈనెల 3న టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న మొదటి పార్టీ సమావేశం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణ, ప్రభుత్వ ప్రజాపాలన, ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తులకు వస్తున్న స్పందన తదితర అంశాలపై క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. వారి నుంచి తగిన సూచనలు, సలహాలు స్వీకరించనున్నారు. వాటిన్నింటిని క్రోడికరించిన నివేదికను ఈనెల 4న ఢిల్లీలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌ సమర్పి ంచనున్నారు. ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించింది. ఏఐసీసీ, టీపీసీసీ నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజక వర్గాలపై ఏఐసీసీ కూడా ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రణాళి కలు రూపొందిస్తున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం, పార్టీ ఓడిపోయిన చోట్ల వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేస్తున్నట్టు తెలిసింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్‌కు ఓట్ల శాతం తక్కువగా వచ్చిందో, అక్కడక్కడ ఓట్ల శాతాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై పార్టీ తీవ్ర కరసత్తు చేస్తున్నది. అధికార కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు మధ్య ఓట్ల తేడా 1.8 శాతమే ఉన్నది. అయినప్పటికీ కాంగ్రెస్‌కు 64 సీట్లు, బీఆర్‌ఎస్‌కు 39 సీట్లు వచ్చాయి. బీజేపీకి 8, ఎంఐఎం 7, సీపీఐకి ఒక సీటు వచ్చింది. ఈ ఫలితాలను సమీక్షించి భారీగా ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్‌ కార్యచరణ రూపొందిస్తున్నది. వీటన్నింటితోపాటు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పరిశీలన కూడా పార్టీకి పెద్దగా సవాల్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని నాయకులకు ఎంపీ సీట్లు ఇస్తామనీ, కార్పొరేషన్‌ చైర్మెన్‌ పదవులిస్తామనీ, ఎమ్మెల్సీ పదవులిస్తామంటూ పార్టీ హామీ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహులు కూడా రంగంలోకి దిగుతున్నారు. అటువంటి నాయకులను ఎట్లా సర్దుబాటు చేయాలనే అంశాన్ని కూడా పార్టీ సీరియస్‌గా చర్చించనుంది. అంతకంటే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి బీసీలకు రెండు సీట్ల చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరలేదు.ఈ ఎన్నికల్లో కచ్చితంగా సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు పార్టీ చర్చలు చేస్తున్నది. దీంతో బలమైన అభ్యర్థులా? సామాజిక సమీకరణాలా? అనేది పార్టీ ఎదుర్కొబోతున్న మరో సమస్య. సొంత పార్టీ నాయకులతోపాటు ఇతర పార్టీల్లోని బలమైన నేతలు సైతం కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అటువంటి వారికి టికెట్‌ ఇచ్చి గెలిపించుకోవాలనే పార్టీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల పోటీ మాత్రం పార్టీలో దీటుగా ఉన్నది. దీంతోపాటు మంత్రులు కూడా తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4 లేదా 5 మంది నాయకులు ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.